
అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి . గడిచిన 24 గంటల్లో కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ రెండు జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్, మెదక్ ఇన్ ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క వరద పరిస్థితులపై ఆరాదీశారు. ఎప్పటికపుడు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మరో వైపు ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ క్రమంలో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు కలెక్టర్లు.
నిర్మల్ జిల్లాలో బారీగా వర్షాలు కురుస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. నిర్మల్ రూరల్ , లక్ష్మణ్ చాందా మండలాల్లో భారీగా వర్షాలు పడ్డాయని చెప్పారు. బారీ వర్షాలు ఉన్నందువల్ల ప్రజలు బయటకు రావద్దని సూచించారు.అందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నందున జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆగస్టు 28న రేపు జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరం అయితేనే జిల్లా ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలని సూచించారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే జిల్లాకి రెడ్ అలెర్ట్ జారీ అయ్యిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 93919 42254 కాల్ చేయాలని చెప్పారు.