
తెలంగాణ వ్యాప్తంగా వాన మేఘాలు కమ్ముకున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలకు పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వానలు మరో 23 గంటల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బుధవారం (ఆగస్టు 27) సాయంత్రం 7 గంటల వరకు వర్షసూచన ఉన్నట్లు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు బయటకు రావద్దని సూచించింది.
ఇక మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం వుందని తెలిపారు అధికారులు. రైతులు పొలాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.
అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాలు, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి. మీ లోపు ఉండి.. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని ప్రకటించింది.