
బుధవారం ( ఆగస్టు 27 ) దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడవాడలా కొలువుదీరాడు బొజ్జగణపయ్య. ఇక హైదరాబాద్ కా షాన్ ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది 69 అడుగులతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు వినాయకుడు. బడా గణేషుడి దర్శనం కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. ఈ క్రమంలో ఖైరతాబాద్ బడా గణేశుడి మండపం దగ్గర క్యూ లైన్ లోనే ప్రసవించింది ఓ మహిళ. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
వినాయాక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వెళ్ళింది రేష్మ. ఈ క్రమంలో రాజస్థాన్ కు చెందిన రేష్మ బడా గణేశుడి క్యూ లైన్ లోనే ప్రసవించింది. దీంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రేష్మను చేర్పించారు స్థానికులు. ప్రస్తుతం రేష్మకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు.
1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా వినాయకుడు ఈ ఏడాదితో 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 69 అడుగులతో కొలువుదీరిన స్వామి కి ఇరువైపుల కుడి పక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క ...కన్యక పరమేశ్వారి, శ్రీ గజ్జాలమ్మ దేవి కొలువుదీరి చూడటానికి వేయి కళ్ళు చాలవన్నట్లు దర్శనమిస్తున్నాడు బడా గణేశుడు.ఏడు దశాబ్దాలుగా ఖైరతాబాద్ లో కొలువు తీరుతున్న మహా గణపతిని శిల్పి రాజేంద్రన్ రూపుదిద్దుతున్నారు.ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి ఏటా లక్షలాదిగా దర్శించుకుంటారు.