
తెలంగాణలో ఈ మధ్య ఎన్నడూ చూడనంత వర్షపాతం నమోదైంది. క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (ఆగస్టు 27) కుండపోత వానలకు పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వరదల కారణంగా రాకపోకలు బందయ్యాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. కుండపోత వానలకు వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.
తెలంగాణ వ్యా్ప్తంగా ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని అర్గొండ లో 41.83 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు కామారెడ్డిలో అంత వర్షపాతం నమోదు కాలేదని చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి.
ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్ లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి లోని IDOC (కామారెడ్డి) లో 28.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వీటి తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందో వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి బికనూరు లో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్ లోని వడ్యాల్ లో 27.58, కామారెడ్డి లోని తాడ్వాయి లో 27, మెదక్ జిల్లాలోని సర్ధానా లో 26.33, కామారెడ్డి లోని పాత రాజంపేట్ లో 24.1 , మెదక్ లోని నాగపూర్ లో 23.65, నిర్మల్ లోని విశ్వనాథ్ పేట్ లో 23.38, నిర్మల్ లోని ముజిగి లో 22 , కామారెడ్డి లోని లింగంపేట్ లో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. మరో 18 ప్రాంతాల్లో అత్యధిక భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.