2019 World Cup: తీవ్ర ఒత్తిడిలో ధోనీ ఆ బాల్ వదిలేయడం ఆశ్చర్యానికి గురి చేసింది: ఫెర్గుసన్

2019 World Cup: తీవ్ర ఒత్తిడిలో ధోనీ ఆ బాల్ వదిలేయడం ఆశ్చర్యానికి గురి చేసింది: ఫెర్గుసన్

క్రికెట్ లో ధోనీ ఒక అన్ ప్రిడిక్టబుల్. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన మాస్టర్ మైండ్ తో బౌలర్ ను ఒత్తిడిలో పడేస్తాడు. అప్పటివరకు స్లో గా ఆడుతూ ఓటమి ఖాయమనుకుంటున్న దశలో జూలు విదిల్చి మ్యాచ్ గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆరేళ్ళ క్రితం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ ఆడిన ఇన్నింగ్స్ పై కొంతమంది విమర్శలకు గుప్పించారు. చివరి వరకు నిదానంగా ఆడాడని.. వేగంగా ఆడి ఉంటే ఇండియా ఫైనల్ కు వెళ్లేదని వింతవాదన చేసిన వారు ఉన్నారు. 

సెమీ ఫైనల్ మ్యాచ్ గమనిస్తే ధోనీ మరీ అతి జాగ్రత్తగా ఆడాడేమో అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే ఇండియా అప్పటికి 31 బంతుల్లో 52 పరుగులు చేయాలి. 45 ఓవర్ చివరి బంతిని లాకీ ఫెర్గుసన్ ఆఫ్ స్టంప్ దిశగా స్లో బాల్ విసిరాడు. కానీ ధోనీ మాత్రం బ్యాట్ ను కదిలించకుండా బాల్ ను వదిలేశాడు. అప్పుడు ధోనీ మైండ్ లో ఏముందో పక్కనపెడితే స్లో బాల్ ను వదిలేయడంతో ఇండియన్ క్రికెటర్స్ తో పాటు కివీస్ బౌలర్ ఫెర్గుసన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ విషయంపై ఫెర్గుసన్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. 

క్రిక్‌ట్రాకర్‌’తో ఫెర్గూసన్‌ మాట్లాడుతూ.. " తీవ్ర ఒత్తిడి సమయంలో ధోనీ నా స్లో డెలివరీని వదిలేయడం ఆశ్చర్యమనిపించింది. ఇండియా ఎంత స్కోర్ చేస్తే గెలుస్తుందో నాకు కరెక్ట్ గా తెలియదు. నేను మాత్రం నా ప్లాన్స్ మీదే దృష్టి పెట్టాను. ధోనీకి బాల్‌ ఎడ్జ్‌ తీసుకునేలా బాల్‌ వేయాలనే ప్లాన్‌ ఉంది. అయితే నేను బాల్‌ వేసినప్పుడు ధోనీ షాట్‌ ఆడకుండా వదిలేశాడు.  ఒక బ్యాటర్ అలా బంతిని వదిలిపెట్టినప్పుడు బౌలర్ కు రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత ఓవర్ మొదటి బంతికి, నేను అదే బంతిని ప్రయతినిస్తే సిక్స్ కొట్టాడు". అని ఫెర్గుసన్ చెప్పుకొచ్చాడు. 

వర్షం అంతరాయం కలిగించిన ఈ సెమీ ఫైనల్లో మ్యాచ్ రెండు రోజులు జరిగింది. మొదట న్యూజిలాండ్ ను 239 పరుగులకే కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకుంది. స్వింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ట్రెంట్‌ బౌల్ట్‌ నేతృత్వంలోనే కివీస్‌ పేస్‌ దళం చెలరేగిపోయింది. దీంతో జట్టు స్కోరు 5 పరుగులకే భారత్‌ కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1)ల వికెట్లను కోల్పోయింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో జడేజా 77 పరుగులతో వీరోచిత పోరాటం చేసినా కీలక సమయంలో జడేజాతో పాటు ధోనీ రనౌట్ కావడం భారత్ కు పరాజయం తప్పలేదు. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.