
కామారెడ్డి, మెదక్ జిల్లాలపై పగబట్టినట్లుగా కురిసిన వర్షాలు ఆ తర్వాత నిర్మల్ జిల్లాలను ముంచెత్తాయి. బుధవారం (ఆగస్టు 27) సాయంత్రం మొదలైన వానలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలకు వరదలు బుసకొడుతున్నట్లుగా భయంకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
భారీ వర్షానికి పట్టణంలోని నటరాజ్ నగర్, ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ, దివ్యనగర్, ఇంద్రానగర్, లోతట్టు ప్రాంతాల పలు కాలనీలు జలమయం అయ్యాయి. సాగర్ కాలనీ పోచమ్మ గుడి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. మూడు గంటలుగా ఏకధాటిగా కురుస్తోంది వర్షం.
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బంగల్ పెటచెరువు డేంజర్ జోన్ లో ఉంది. ఆనకట్ట కోతకు గురవుతున్నా . దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రూరల్ మండలం అక్కాపూర్ లో 27.5 సెం.మీ. వర్షపాతం కురిసింది. లక్ష్మణా చాందా మండలం వడ్యాల్ లో 23.8 సెంమీ వాన పడింది. ఇక నిర్మల్ మండలం విశ్వనాథ్ పెటలో 17.6, సోన్ మండలం పాక్ పట్ల లో15.0 సెమీ, సారంగపూర్ మండలం జామ్ లో 14.1 వర్షపాతం నమోదైంది.
మరోవైపు ఖానాపూర్ మండలంలో అలర్ట్ ప్రకటించారు అధికారులు. అతి భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చాటింపు వేశారు. మైక్ లతో ప్రచారం చేస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన స్థలాల్లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు.
నిండుతున్న ప్రాజెక్టులు.. భయం గుప్పిట్లో ప్రజలు:
భారీ వర్షాలు, వరదలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వదర నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతం లో కురుస్తున్న వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 4 గేట్లనుఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 697.200 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీ ఎం సీ లు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 4.014టీ ఎం సీ లకు చేరుకుంది. ఇన్ ఫ్లో 4547 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 19964 క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టు కు ఉన్న 4 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు అధికారులు. దిగువన గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు.