
అంకాపూర్ లో 20 ఏళ్లుగా 165 కుటుంబాలు అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నామని, పెరిగిన నిత్యావసర ధరల వల్ల అద్దె కట్టలేకపోతున్నామని గ్రామస్తులు మీడియాకు విడుదల చేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆ వినతి పత్రంతో పాటు ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన, ప్రస్తుతం ఇళ్ల పరిస్థితికి సంబంధించిన ఫోటోలను కూడా అందజేశారు.
‘‘2014 ఆగస్టు 7న సీఎం కేసీఆర్ అంకాపూర్ లో పర్యటించారు. వచ్చినంతనే దేవుడు వరమిచ్చినట్టు రాష్ట్రంలో మొట్టమొదట అంకాపూర్‌లో ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దాంతో మా కల సాకారమైందని అనుకున్నం. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. 2015 నవంబర్ 9న ఆనాటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా 165 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ ఐదేండ్లవుతున్నా మొక్కుబడి వ్యవహారంగా పునాది గుంతలు తవ్వినట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది. మా కల కలగానే మిగిలిపోయింది.
సీఎం సార్ మీద మాకు ఎంతో అభిమానం, ప్రేమ ఉన్నయి. ఎందుకంటే అంకాపూర్ గ్రామాన్ని ఎన్నోసార్లు కీర్తించారు. మీకు రుణపడి ఉంటాం. అలాగే ఈ నిరుపేద బతుకులు బాగు చేస్తారని, మా జీవితాల్లో వెలుగులు నింపుతారని.. ఎర్రవెల్లి గ్రామంలో ఇండ్లు బాధ్యతగా నిర్మింపజేసినట్టు అంకాపూర్లోనూ నిర్మించి మా కుటుంబాలకు అండగా నిలుస్తారని ఆశతో మీ వద్దకు వచ్చాం. దయచేసి మా సమస్యను పెద్ద మనసుతో పరిష్కరించండి. మీరు హామీ ఇచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా కలెక్టర్ల దగ్గరికి, ఆర్డీవో, ఎంఆర్వో, ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి లెక్కలేనన్ని సార్లు మా సమస్యను విన్నవించినం. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరి ప్రయత్నంగా మీ వద్దకు వచ్చి మా బాధను విన్నవించుకుంటున్నాం. మా సమస్యను పరిష్కరిస్తారని పూర్తి నమ్మకం మీపై ఉంది. దయతో మాకు ఇండ్లు కట్టివ్వండి..’’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.