బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన కె.అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉందని.. కామన్ మ్యాన్ పాలిటిక్స్ రావాల్సి ఉందని.. ఆ దిశగానే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు అన్నామలై. దేశంలో వారసత్వ రాజకీయాలకు చమరగీతం పాడాల్సిన అవసరం ఉందని.. కామన్ మ్యాన్ పాలిటిక్స్ రావాలన్నారాయన. వాళ్ల కొడుకులు, మనవళ్లు.. వాళ్ల పిల్లలేనా రాజకీయం చేసేది.. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు రాజకీయ చేయటానికి అనర్హులా అని ప్రశ్నించారు అన్నామలై.
రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని.. ఆ తర్వాత 2031లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామన్నారాయన. ఈ ఐదేళ్లల్లో రాజకీయ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు అన్నామలై.
సామాన్యుడు.. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా పని చేస్తామని.. యువతకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు రావాలన్నారు అన్నామలై. ప్రపంచం ఎంతో ముందుకు వెళుతుందని.. ఆపిల్, శాంసంగ్, గూగుల్ వంటి ఎన్నో కంపెనీలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయని.. అలాంటి కంపెనీలు ఇండియాలో ఎందుకు లేవని ప్రశ్నించారు అన్నామలై. ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ కంపెనీల్లో పని చేస్తున్న వాళ్లల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారని.. మరి అలాంటి వాళ్లు ఇండియాలో అలాంటి కంపెనీలు ఎందుకు పెట్టటం లేదని నిలదీసిన అన్నామలై.. ఆ దిశగా మార్పు కోసం నా పార్టీ పోరాడుతుందని.. మా పార్టీ విజన్ అలాగే ఉంటుందని వెల్లడించారు అన్నామలై.
గ్రామాలను నిర్లక్ష్యం చేయటం తగదని.. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్లటం పరిష్కారం కాదన్న అన్నామలై.. గ్రామాలను పట్టణాలుగా మార్చటం అనేది ఇప్పుడు జరగాల్సిన మార్పు అని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పట్టణాలను వలసలు వెళితే.. గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం అయ్యి.. వ్యవసాయం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారాయన. అందుకే ఆయా గ్రామాలకు సామర్థ్యం ఉంటే వాటిని పట్టణాలను తీర్చిదిద్దినట్లయితే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు స్థానికంగా దొరుకుతాయన్నారు అన్నామలై. ఈ దిశగా ప్రభుత్వాలు కొత్త పారిశ్రామిక ప్రణాళికలు తీసుకురావాలని డిమాండ్ చేశారు అన్నామలై.
రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు.. పార్టీలో జాయిన్ కావాలని తనను ఆహ్వానించారని.. రజినీకాంత్ కు క్షమాపణలు చెప్పిన తర్వాతనే బీజేపీలోనే చేరినట్లు స్పష్టం చేశారాయన. కామన్ మ్యాన్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో దేశానికి చూపిస్తానని వెల్లడించారు అన్నామలై.
