
బీసీ-ఏ లోకి 13, బీసీ-డీ లోకి 4
ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్
హైదరాబాద్, వెలుగు: బీసీ జాబితాలోకి మరో 17 కులాలు చేరాయి. బీసీ–ఏ లో 13 కులాలు, బీసీ–డీలో 4 కులాలు చేర్చారు. రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. దీనిపై అధికారికంగా జీవో రావల్సి ఉంది. కులాల చేరికతో బీసీ–ఏ లో కొత్తగా 28,402 మంది జనాభా, బీసీ– డీలో 15,409 జనాభా చేరినట్లయ్యింది. మొత్తంగా 9,849 కుటుంబాలతో 43,811 మంది బీసీ జాబితాలో చేరారు. ఈ కులాలు ఇప్పటి వరకు ఏ జాబితాలో లేరని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వీరందరినీ జాబితా వచ్చిన మొదట్లో జరపాల్సి ఉండగా, ఇప్పటికి కుదిరిందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం బీసీ జాబితాలో 119 కులాలు ఉండగా, తాజా గా 17 కులాలు చేరడంతో మొత్తంగా 136 కి చేరింది. కాగా ఇప్పటి దాకా ఈ సంచార జాతులకు గుర్తింపు లేకపోవడంతో రిజర్వేషన్లు పొందలేదు.
కొత్తగా చేర్చిన 17 కులాలు ఇవే..
అద్దపు వారు, బాగోతుల, బైల్‌కమ్మర, ఏనూటి, గంజికూటివారు, గౌడజెట్టి, కాకిపడగల, మాసయ్యలు (పటంవారు), ఓడ్, సన్నాయోల్లు, శ్రీ క్షత్రియ రామజోగి, తెరచీరల, తోలుబొమ్మలాటవారు(బొప్పల) అనే కులాలను బీసీ ఏ లో చేర్చారు. అహీర్ యాదవ్, గొవిలి, కుల్లకడగి, సారోళ్లు అనే కులాలను బీసీ డీ జాబితాలో చేర్చారు.
బీసీ కమిషన్ సిఫార్సు మేరకు..
తమను బీసీ జాబితాలోకి చేర్చాలంటూ దాదాపు 30 కులాలు తెలంగాణ బీసీ కమిషన్‌కు గతంలో దరఖాస్తు చేసుకున్నాయి . దీంతో బీసీ జాబితాలో చేర్చడానికి తగిన ఆధారాలు సమర్పించాలంటూ ఆయా కుల సంఘాల నాయకులను కమిషన్ కోరింది. ఆ ఆధారాలను పరిశీలించిన తర్వాత వాటిలో 17 కులాలు బీసీ జాబితాలో చేర్చేందు కు అర్హమైనవిగా గుర్తించింది. కమిషన్ రాష్ ట్రవ్యాప్తంగా పర్యటించి.. ఒక నివేదిక రూపొందించింది. ఈ 17 కులాలూ బీసీ జాబితాలో చేరేందుకు అర్హత ఉన్నా యంటూ గతేడాది అక్టోబరు 28న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కులాల గుర్తింపు ఫైల్ ఇప్పటి దాకా సీఎంవోలోనే పెండింగ్‌లో ఉంది. అయితే 18వ కులంగా అరవ కోమటి అనే కులాన్ని కూడా చేర్చాలని బీసీ కమిషన్ మొదటగా భావించినా ఆ తర్వాత రిజెక్ట్ చేసింది. దీన్ని చేర్చితే కోమటోళ్లు మొత్తం దీని పేరు చెప్పుకొని బీసీల్లో చేరే అవకాశం ఉందని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి: ఆర్. కృష్ణయ్య
కాగా 17 కులాలను బీసీల్లో చేర్చడంపై ఎలాంటి అభ్యంతరం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. అయితే ఇదే సమయంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. 17కులాల చేరిక ఓ విప్లవాత్మక చర్య అని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ పేర్కొన్నారు.