- యశోద ఘటన మరువకముందే నల్లగండ్లలో మరో దొంగతనం
- రోగికి మత్తుమందు ఇచ్చి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన కిలేడీ!
చందానగర్, వెలుగు: సిటీలోని కార్పొరేట్ హాస్పిటళ్లలో నకిలీ డాక్టర్లు కలకలం సృష్టిస్తున్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటట్లో రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే.. తాజాగా నల్లగండ్లలోని మరో కార్పొరేట్ హాస్పిటల్లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. సంగారెడ్డికి చెందిన అరుణ (63) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఈ నెల 8న నల్లగండ్లలోని సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది.
రూమ్ నెంబర్ 6004 లో చికిత్స పొందుతున్న ఆమె వద్దకు మార్చి 10న డాక్టర్ వేషంలో ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి, చికిత్స పేరుతో మత్తు మందు ఇచ్చి మెడలోని 15 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. గాఢ మత్తులో నుంచి తేరుకున్న అరుణ ఆ తర్వాత నగలు లేకపోవడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలిపింది.
దీంతో ఆసుపత్రి యాజమాన్యాన్ని బాధితురాలి కొడుకు రితిక్ నిలదీయగా, సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం ఆ మహిళ తమ ఉద్యోగి కాదని యాజమాన్యం తేల్చిచెప్పింది. ఆసుపత్రిలో ఇంత సెక్యూరిటీ ఉన్నా గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వచ్చి దొంగతనానికి పాల్పడటంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యం, దొంగతనంపై రితిక్ ఫిర్యాదు చేయడంతో చందానగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
