సీజేఐకి పురందేశ్వరి లేఖ -.. విజయసాయిరెడ్డి బెయిల్ పై ఫిర్యాదు

సీజేఐకి పురందేశ్వరి లేఖ -.. విజయసాయిరెడ్డి బెయిల్ పై ఫిర్యాదు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు. విజయసాయి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు దిగారని ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జిగా వున్న సమయంలో కడప గూండాలను దించి అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పురందేశ్వరి పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పు దోవ పట్టించారన్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ..  ఈ కారణాలతో విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పురందేశ్వరి సీజేఐ డీవై చంద్రచూడ్ ను కోరారు.

 

జగన్, విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు పదేళ్లకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని పురందేశ్వరి లేఖలో తెలిపారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న సందర్భంలో భయంతో జీవిస్తున్న ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు నిత్యం వస్తున్నాయన్నారు.  సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్ధల విచారణ ముందుకు సాగకుండా ఆలస్యం చేస్తూ అడ్డుకుంటున్నారన్నారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయించుకోవడం, విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారన్నారు.

విజయ సాయి రెడ్డిపై ఐపీసీ కింద పలు తీవ్ర కేసులు నమోదైనట్లు సీజేకి రాసిన లేఖలో పురందేశ్వరి ప్రస్తావించారు. ఇవన్నీ గమనిస్తే సాయిరెడ్డికి తిమ్మిని బమ్మిని చేసే సామర్ధ్యం ఉందని తెలుస్తుందన్నారు. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరికీ 2012 ఏప్రిల్ లో సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చిందని, వీరిద్దరి బెయిల్ షరతుల్లో పేర్కొన్న అంశాలు జగన్ ఎంపీగా, విజయ సాయిరెడ్డి ఆడిటర్ గా ఉన్నప్పుడు ఇచ్చినవని, ఇప్పుడు వారిద్దరూ అత్యున్నత అధికార హోదాల్లో ఉన్నారన్నారు.

ఏపీలో మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకుంటున్నారని, ఢిల్లీ మద్యం స్కాంలో సాయిరెడ్డి దగ్గరి బంధువుల పాత్ర నేరుగా ఉందని పురందేశ్వరి తెలిపారు. అలాగే విజయసాయి రెడ్డి తన బినామీల ద్వారా ఏపీలో డిస్టలరీలను నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో బయటపడిందన్నారు. ఈ అంశం వెలుగులోకి రాగానే ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖలు లేఖ రాశామన్నారు. అలాగే సాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా ఉన్నప్పుడు భూకబ్జాలు, వసూళ్లకు పాల్పడ్డారన్నారు. దసపల్లా భూముల వ్యవహారాన్ని ఇందులో ప్రస్తావించారు. వైజాగ్ రాజధాని గురించి ముందస్తు సమాచారంతో ఈ అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

అలాగే ఆయా అంశాలపై తాను బాధ్యతగా ప్రశ్నిస్తే సాయిరెడ్డి ప్రెస్ మీట్లో తనను బెదిరించారని పురందేశ్వరి ఆరోపించారు. భవిష్యత్తులో మాట్లాడితే, తనను ప్రజల మధ్య బయట తిరగకుండా చేస్తానని వ్యక్తిగత దూషణలతో విజయసాయి రెడ్డి బెదిరించారన్నారు. ఈ బహిరంగ బెదిరింపులను బెయిల్ షరతుల ఉల్లంఘనగా పరిగణించాలని, పదేళ్లుగా బెయిల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న సాయిరెడ్డిపై సమీక్ష చేయాలన్నారు.

వివేకా హత్య కేసులోనూ గుండెపోటుగా సాయిరెడ్డి చెప్పిన విషయం, అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఏపీ పోలీసులు అడ్డుకోవడం వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కాబట్టి వీరి బెయిళ్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు  సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు.