బనకచర్లకుసహకరించండి.. 200 టీఎంసీలకు అనుమతివ్వండి: చంద్రబాబు

బనకచర్లకుసహకరించండి.. 200 టీఎంసీలకు అనుమతివ్వండి: చంద్రబాబు
  • కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్​కుఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి  
  • రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు విన్నపం 
  • అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వినతి

న్యూఢిల్లీ, వెలుగు:  పోలవరం–-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్​కు సహకరించాలని, 200 టీఎంసీల జలాల తరలింపునకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్​తో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. సీఆర్ పాటిల్​తో భేటీ సందర్భంగా.. పోలవరం– బనకచర్ల ప్రతిపాదనను సమర్పించారు. గోదావరి వరద నీటిని ఏపీలోని కరువు పీడిత ప్రాంతాలకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి‌‌ ఇస్తే, వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జల్ జీవన్, బ్లూ రివల్యూషన్, మేక్ ఇన్ ఇండియా వంటి జాతీయ మిషన్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. ప్రాజెక్టు వివరాలతో కూడిన డీపీఆర్ త్వరలో సమర్పిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం పనులు‌‌ ఫాస్ట్ ట్రాక్​లో జరుగుతున్నాయని, 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు. పునరావాసం ఖర్చు మొత్తం కేంద్రమే భరించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు వెంట‌‌ కేంద్ర మంత్రులు కె.‌‌రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, టీడీపీ, బీజేపీ ఎంపీలు ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవడానికి నిధులు ఇవ్వాలని, పూర్వోదయ పథకం కింద నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావల్సిన బకాయిలు విడుదల చేయాలని, పోలవరం--, బనకచర్లకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి

అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్ర హోం‌‌మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేండ్ల కాలపరిమితి ముగిసిందన్నారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా గుర్తించారని, అందుకే దాన్ని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమిత్ షా స్పందిస్తూ.. విభజన చట్టంలో సవరణ తీసుకొస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పీఎం సూర్య ఘర్ యోజనకు కూడా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. మొత్తం 35 లక్షల కుటుంబాలకు సోలార్ పవర్ ఇవ్వాలని ప్రతిపాదనలు సమర్పించామన్నారు. అలాగే, రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్‌‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో ఉత్పత్తి కేంద్రాలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో కూడా ఏపీ సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో శ్రీహరికోట, లేపాక్షి ప్రాంతాలకు సమీపంలో రెండు స్పేస్ సిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, వీటికి సహకారం అందించాలని కోరారు. ఏపీ సర్కారుకు స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ ను నియమించామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు.