
ఏపీ సీఎం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఇకపై హలో సీఎంగారు .. ఇదండీ మా సమస్య అని 1902 టోల్ ఫ్రీకి కాల్ చేస్తే వెంటనే కాల్ సెంటర్ ప్రతినిధి ఫిర్యాదును నమోదు చేసుకుని యువర్ సర్వీస్ రిక్వెస్ట్ (YSR) ఐడీని కేటాయిస్తారు. ఆ తర్వాత ఫిర్యాదుపై స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ ద్వారా అప్‌డేట్ చేస్తారు. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి పరిష్కారం అయ్యేలా ట్రాకింగ్ విధానాన్ని తీసుకొచ్చారు.
సీఎం దృష్టికి సమస్యలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి.. వాటిని పరిష్కరించనున్నారు. పథకాలతో పాటూ ప్రభుత్వ సేవల్లో ఎదురయ్యే ఇబ్బందుల్ని నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు సీఎం. పార్టీలకు అతీతంగా.. అర్హత ఉండే ప్రతి ఒక్కరికి పథకం అందాల్సిందే అన్నారు.
ప్రతి సమస్య పరిష్కారం
ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా పథకాల అమలు చేస్తున్నామన్నారు జగన్. స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని.. ఆ తర్వాత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని.. ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందన్నారు.
1902 టోల్ ఫ్రీ ద్వారా సమస్యలు పరిష్కారం
టోల్ ఫ్రీ నెంబర్-1902కు కాల్ చేస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని.. ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు పరిష్కారమవుతుందన్నారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని..అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు సీఎం.