ఏపీలో సడలిపుంలతో నెలాఖరు వరకు లాక్ డౌన్

ఏపీలో సడలిపుంలతో నెలాఖరు వరకు లాక్ డౌన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కరోనా పరిస్థితులపై చర్చించి లాక్ డౌన్ ను పొడిగించాలని.. అయితే కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం  2 గంటల వరకు ఉన్న లాక్ డౌన్ సడలింపులను సాయంత్రం 6 వరకు పొడిగించారు. అయితే దుకాణాలు సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని.. అందరూ ఇళ్లు చేరుకునేందుకు వీలుగా మరో గంటసేపు గడువిచ్చారు. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశించారు. 
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున ఈ జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు మాత్రమే సడలింపు ఉంటుంది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్‌ టైమింగ్స్‌ కొనసాగుతాయి. ఇప్పటి వరకు ఉన్న 50 శాతం హాజరు బదులు ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు  చేశారు.