ఇష్టారీతిన..ఏపీ నీళ్ల దోపిడీ

ఇష్టారీతిన..ఏపీ నీళ్ల దోపిడీ
  • శ్రీశైలం నీళ్లన్నీ బేసిన్​ అవతలికి తరలించేలా పనులు
  • పవర్​హౌస్​లపై మరోసారి సుప్రీం తలుపుతట్టిన ఏపీ

హైదరాబాద్, వెలుగు: కృష్ణానది నీళ్లను రాయలసీమకు మళ్లించుకునే పనులను ఏపీ స్పీడప్ చేసింది. ఎలాంటి పర్మిషన్లు లేకున్నా.. అక్రమ ప్రాజెక్టులను స్పీడ్​గా పూర్తి చేస్తున్నది. ఇప్పటికే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​స్కీం పనులను దాదాపు కంప్లీట్ చేసిన ఏపీ సర్కారు.. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ నుంచి రోజుకు ఏడు టీఎంసీలను తరలించుకునేలా శ్రీశైలం రైట్​మెయిన్​కెనాల్(ఎస్ఆర్ఎంసీ) సిమెంట్​ లైనింగ్​పనులు చేస్తున్నది. తద్వారా శ్రీశైలం నీళ్లను రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు యథేచ్ఛగా మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నది.

రాయలసీమలోని కర్నూల్​మాత్రమే కృష్ణా బేసిన్​పరిధిలోకి వస్తుంది. మిగతా జిల్లాలు బేసిన్​అవతలివి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో 326 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించుకున్న ఏపీ.. వాటికి జలభద్రత కల్పించేలా శ్రీశైలం నీటిని మళ్లించుకునే పనులు చేస్తున్నది. దీనికితోడు తెలంగాణ హైడల్​పవర్​ను కట్టడి చేసే కుట్రలకు తెరతీసింది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్​లో టీఎస్​జెన్​కో పవర్​జనరేషన్ చేయకుండా కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు పవర్​హౌస్​లను కేఆర్ఎంబీకి అప్పగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​దాఖలు చేసింది.

శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలు లిఫ్ట్​చేసేలా సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల స్కీంకు 2020 మే 5న ఏపీ రూ.6,829.15 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇదీ పూర్తిగా కొత్త స్కీం. కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలంటే  కేఆర్ఎంబీతో పాటు అపెక్స్​కౌన్సిల్​అనుమతి తప్పనిసరి. అయితే దీనికి ఎలాంటి అనుమతులు రాలేదు. పనులు చేపట్టొద్దని ఎన్జీటీ స్టే కూడా ఇచ్చింది అయినా ఏపీ ప్రభుత్వం రాత్రి పూట ఫ్లడ్​లైట్లు పెట్టి పనులు చేస్తున్నది.

శ్రీశైలంలో 854 అడుగులకు నీటిమట్టం చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోలేమని ఏపీ చెస్తున్నప్పటికీ అది నిజం కాదు. రిజర్వాయర్​లో 841 అడుగులకు నీటిమట్టం చేరితే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవచ్చు. ఆ విషయాన్ని ఏపీ తొక్కిపెడుతూ.. రిజర్వాయర్​లో 854 అడుగులకు నీటిమట్టం చేరే వరకు టీఎస్​జెన్​కో.. శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్​పవర్​హౌస్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించింది. అయితే శ్రీశైలం నిర్మించిందే హైడల్​పవర్​జనరేషన్​కోసం.. ఆ స్ఫూర్తిని ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతూ ఆ రిజర్వాయర్​లో నీళ్లన్ని దోపిడీ చేసేలా పనులు చేసుకుపోతున్నది.

ఎస్ఆర్ఎంసీ నుంచే రోజుకు 7 టీఎంసీలు..

చెన్నై తాగునీరు, రాయలసీమ సాగునీటి అవసరాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టుపై పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ నిర్మించారు. దీని ద్వారా రోజు  1,500 క్యూసెక్కులు డ్రా చేయడానికి అనుమతులు ఉన్నాయి. చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్ఆర్ఎంసీకి 19 టీఎంసీలు తీసుకోవడానికి పర్మిషన్​ఉంది. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రోజుకు 11,150 క్యూసెక్కులు (ఒక టీఎంసీ) తరలించేలా దాన్ని డిజైన్​చేశారు. వైఎస్​సీఎం అయ్యాక 44 వేల క్యూసెక్కులు తరలించేలా ఇంకో పది గేట్లతో కొత్త హెడ్​రెగ్యులేటర్​నిర్మించారు.

కొత్త రెగ్యులేటర్​ఆపరేషన్​లోకి రాగానే పాత హెడ్​రెగ్యులేటర్​మూసేస్తామని అప్పట్లో హామీ ఇచ్చినా.. రెండు హెడ్​రెగ్యులేటర్లు అలాగే ఉన్నాయి. ఎస్ఆర్ఎంసీ నుంచి ప్రస్తుతం 44 వేల క్యూసెక్కులు (రోజుకు 4 టీఎంసీలు) తరలించే అవకాశం ఉండగా, దానికి సిమెంట్​లైనింగ్​చేసి రోజుకు ఏడు టీఎంసీలకు పైగా తరలించేలా డెవలప్ చేస్తున్నారు. లైనింగ్​పనులు పూర్తయితే పది రోజుల్లోనే ఎస్ఆర్ఎంసీ నుంచి 70 టీఎంసీలు తీసుకునే చాన్స్ ఉంది. దీనికి తోడు హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి లిఫ్ట్​స్కీంలు, వెలిగొండ టన్నెల్​ప్రాజెక్టు ద్వారా ఏపీ ఇంకో రెండు టీఎంసీలకు పైగా మళ్లించుకునే పనులు పూర్తి చేసింది.