R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమైంది. ఇటీవల R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు, జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన 2 పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ మే 5వ తేదీ శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీంతో పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏర్పాటు చేస్తోంది. 10 లే అవుట్లలో 45 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని 23 వేల మందికి.. ఐనవోలు, మందడం, కురగల్లు, నిడమర్రులలో ప్లాట్లు కేటాయించనుంది. ఈ మేరకు అధికారులు పట్టాల పంపిణీకీ ఏర్పాటు చేస్తున్నారు.  మే 15వ తేదీ నుంచి ఇంటి స్థలాల పంపిణీకి శ్రీ‌కారం చుట్టే అవ‌కాశం ఉంది.

కాగా, జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేయడంతో పట్టాల పంపిణీకి మార్గం సుగమమైంది. R5 జోన్ అంశంపై అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన రైతుల అభ్యర్ధనను కోర్టు నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు అమరావతి రైతులు. కానీ సుప్రీంలోనూ రైతులకు చుక్కెదురైంది.