బీఆర్ఎస్ వాళ్ల కడుపులో మూసీని మించిన విషం : సీఎం రేవంత్

బీఆర్ఎస్ వాళ్ల కడుపులో  మూసీని మించిన విషం : సీఎం రేవంత్
  • మురికికూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తమంటే అడ్డుకుంటరా?
  • అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదు: సీఎం రేవంత్
  • రూ.కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేయిస్తున్నరు 
  • ఎవరెన్ని చేసినా వెనక్కి తగ్గను.. ప్రక్షాళన చేసి తీరుతాం
  • అక్రమ కట్టడాలు, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లను ఉపేక్షించేది లేదు.. ఎంతటివారైనా విడిచిపెట్టం 
  • మేం చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు.. హైదరాబాద్ అభివృద్ధి
  • మూసీలో ఏడాదంతా మంచినీళ్లు ప్రవహించేలా ప్రణాళిక.. 
  • రెండేండ్లలో గండిపేటకు గోదావరి జలాలు 
  • మార్చి 31లోగా మూసీ ప్రక్షాళన మొదటి దశ పనులు ప్రారంభం 
  • గండిపేట టు గౌరెల్లి 55 కి.మీ భారీ ఎలివేటెడ్ కారిడార్
  • నదీ తీరంలో ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణం 
  • బాపుఘాట్‌‌‌‌ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన అంటే నది సుందరీకరణ మాత్రమే కాదని.. అది తెలంగాణ ఆత్మగౌరవానికి, భవిష్యత్ తరాల మనుగడకు సంబంధించిన జీవన్మరణ సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ పునరుజ్జీవంపై  ఆయన మాట్లాడారు. మూసీ మురికిలో బతుకుతున్న ప్రజలను ఆ నరకం నుంచి బయటపడేసేందుకు తాము ముందుకువెళ్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. ‘‘మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు మీరు (ప్రతిపక్షాలు) అడ్డుపడతామంటే ఊరుకునేదిలేదు. అసలు మీ కడుపులో ఎందుకంత విషం? మూసీ మురికి కంటే మీ కడుపులోని విషమే ప్రమాదకరం.

 కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో  ఎమ్మెల్యేలందరూ సౌత్ కొరియా, లండన్ వెళ్లి అక్కడి నదులను చూసి రండి.. సూచనలు ఇవ్వండి. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదు” అని సీఎం హెచ్చరించారు. తాను మాట్లాడుతున్న టైమ్‌‌‌‌లో ప్రతిపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘‘హైదరాబాద్‌‌‌‌ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను సభలో వివరిస్తుంటే.. ఓర్వలేక విషం చిమ్ముతున్నారు. నిజాలు ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతోనే సభను అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష సభ్యుల కళ్లలో ద్వేషం ఏ స్థాయిలో ఉందంటే.. ఒకవేళ ఆ విషపు చూపులకు శక్తి ఉంటే అన్నీ కాలి బూడిదైపోయేంతలా వారి చూపులు ఉన్నాయి’’ అని మండిపడ్డారు.

మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులయ్యే పేదలకు అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘జన్వాడ, మొయినాబాద్‌‌‌‌‌‌‌‌లో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లు కట్టుకున్నోళ్లు రూ.కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేయిస్తున్నారు. అయినా పేదలకు మంచి జరగాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను.. వెనక్కి తగ్గేది లేదు” అని స్పష్టం చేశారు. ‘‘మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులయ్యే పేదలకు అన్యాయం జరగనివ్వం. నిర్వాసితులకు అదే ప్రాంతంలో లేదా దగ్గర్లో ఇండ్లు కట్టిస్తం. స్కూళ్లు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తం. ఉపాధి కూడా కల్పిస్తాం” అని వెల్లడించారు. ‘‘ఏడాది పొడవునా మూసీలో స్వచ్ఛమైన నీళ్లు పారేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నం. 

ఇందుకోసం రాబోయే రెండేండ్లలో గోదావరి జలాలను గండిపేటకు తరలిస్తం. మార్చి 31లోగా టెండర్లు పూర్తి చేసి, మొదటి దశ పనులు చేపడతాం. డీపీఆర్ రాగానే అందరినీ పిలిచి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్త” అని తెలిపారు. ‘‘గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని సబర్మతి, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని గంగానది తరహాలో హైద రాబాద్‌‌‌‌‌‌‌‌లో మూసీని అంతర్జాతీయస్థాయి పర్యాటక, వ్యాపార కేంద్రంగా మారుస్తం. ఇందుకోసం గోదావరి నుంచి 20 టీఎంసీలను తరలిస్తం. నల్గొండ జిల్లా ప్రజ లకు ఫ్లోరైడ్ రక్కసి నుంచి విముక్తి కల్పించి.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు.. ఉన్నదల్లా పేదల బతుకులు మార్చాలన్న సంకల్పమే” అని తేల్చి చెప్పారు.   

ప్రక్షాళనకు పక్కా ప్రణాళిక.. 

మూసీ ప్రక్షాళన కోసం ప్రపంచ స్థాయిలో అనుభవమున్న సంస్థలను ఎంపిక చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘గ్లోబల్ టెండర్ల ద్వారా సింగపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మెన్‌‌‌‌‌‌‌‌హార్ట్, కుష్‌‌‌‌‌‌‌‌మన్ అండ్ వేక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్, రియోస్ డిజైన్ స్టూడియోలతో కూడిన కన్సార్టియంను కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌గా నియమించాం. ఇది ప్రాజెక్ట్ డిజైన్, ఆర్థిక వనరుల సమీకరణ, నీటి నిర్వహణ అంశాలపై పని చేస్తున్నది. మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ (9.5 కి.మీ), హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ (11.5 కి.మీ) వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర నదిని అభివృద్ధి చేస్తం. ఈ రెండు నదులు కలిసే బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తం.. అక్కడ ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెడ్తం. మూసీకి జీవం పోయాలంటే నీళ్లు అవసరం. 

అందుకే రూ.7 వేల కోట్లతో గోదావరి నుంచి 20 టీఎంసీలను తరలించే పనులు ప్రారంభించాం. ఇందులో 15 టీఎంసీలు నగర తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలు గండిపేటలో వదిలి మూసీని ప్రక్షాళన చేయడానికి వినియోగిస్తం. వచ్చే రెండేండ్లలో గోదావరి జలాలు గండిపేటకు వస్తాయి. మార్చి 31 లోపు మొదటి దశ డీపీఆర్  సిద్ధమవుతుంది. ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తం. మూసీ ప్రక్షాలన మొదటి దశకు ఆసియన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ.4,100 కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది” అని వెల్లడించారు.

గండిపేట టు గౌరెల్లి.. ఎలివేటెడ్ కారిడార్ 

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ మూసీ వెంబడి భారీ ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌‌‌‌‌ నిర్మించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘‘గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర ఈ స్కైవే ఉంటుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) 160 కిలోమీటర్లు ఉంది. సిటీలో ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లాలంటే 80 కిలోమీటర్లు తిరగాలి. కానీ ఈ ఎలివేటెడ్ కారిడార్ వస్తే కేవలం 55 కిలోమీటర్లలోనే గమ్యం చేరు కోవచ్చు. నార్సింగి, బాపుఘాట్, చార్మినార్, చాద ర్‌‌‌‌‌‌‌‌ఘాట్, నాగోల్ వంటి రద్దీ ప్రాంతాల్లో ‘ట్రంపెట్ జంక్షన్లు’ ఏర్పాటు చేసి.. ప్రజలు ఈజీగా ఎక్కడానికి, దిగడానికి వీలు కల్పిస్తాం. తద్వారా సిటీ ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. ఇక పాత బస్తీని మేం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. మీరాలం ట్యాంక్ అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయించాం. చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పొడిగిస్తున్నాం” అని తెలిపారు.  

వ్యాపారం కాదు.. అభివృద్ధి

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అవును.. నగర అభివృద్ధి అంటేనే రియల్ ఎస్టేట్ విస్తరణ. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే మౌలిక వసతులు ఉండాలి. హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. కానీ ఇప్పుడు అక్కడ లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఓఆర్ఆర్ లోపల కోటి 34 లక్షల మంది ఉన్నారు. ఇది టోక్యో జనాభా కంటే ఎక్కువ. భవిష్యత్తులో 75 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటారు. దానికి తగ్గట్టు నగరాన్ని తీర్చిదిద్దడం నా బాధ్యత. లండన్ థేమ్స్ నదిని, సింగపూర్‌‌‌‌‌‌‌‌ను, దక్షిణ కొరియాను చూసి నేర్చుకుందాం. నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా మారిస్తేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ‘నైట్ ఎకానమీ’ని ప్రోత్సహిస్తాం. నది ఒడ్డున ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ సెంటర్స్ వస్తాయి’’ అని వెల్లడించారు. 

సర్వమత సమ్మేళనంగా మూసీ తీరం 

మూసీ పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మంచిరేవుల వద్ద 850 ఏండ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని పునరుద్ధరిస్తం. మక్కా మసీదు సమీపంలో అంతర్జాతీయ స్థాయి మసీదు, గౌలిగూడ వద్ద స్వర్ణ దేవాలయం తరహాలో సిక్కు గురుద్వారా, ఉప్పల్ వద్ద మెదక్ చర్చిని తలపించేలా భారీ చర్చిని నిర్మిస్తం. ఒకపక్క గుడి, మరోపక్క మసీదు, ఇంకోపక్క చర్చి, గురుద్వారా.. ఇలా నాలుగు మతాల సమ్మేళనంగా మూసీ తీరం వర్ధిల్లుతుంది’’ అని పేర్కొన్నారు.

బాపుఘాట్ వద్ద రక్షణ శాఖకు చెందిన భూములను తీసుకునేందుకు కేంద్రమంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడాం. ఆయన సానుకూలంగా ఉన్నారు. అక్క డ గాంధీ సరోవర్ నిర్మించి, ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పా టు చేస్తం” అని చెప్పారు. కేంద్రంతో సయోధ్య రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప.. కేసుల భయంతో కాదని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.  

గత పాలకుల పాపం.. నల్గొండకు శాపం

మూసీ నదికి ఎంతో చరిత్ర ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘వికారాబాద్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదులు లంగర్‌‌‌‌‌‌‌‌హౌస్ వద్ద కలుస్తాయి. వికారాబాద్ అడవి.. వనమూలికల గని. అందుకే నిజాం కాలంలో ‘వికారాబాద్ కా హవా.. లాఖోం కి దవా’ (వికారాబాద్ గాలి లక్షల రోగాలకు మందు) అనే నానుడి ఉండేది. టీబీ పేషెంట్లను అక్కడ వదిలేస్తే ఆ గాలికి, నీటికి తగ్గిపోయేది. అంతటి పవిత్రమైన నీరు గండిపేటకు చేరి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేది. కానీ నేడు కొందరు శ్రీమంతులు ఆ ప్రాంతంలో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లు కట్టి, డ్రైనేజీలను జలాశయాల్లోకి వదిలి.. ఆ నీటిని విషతు ల్యం చేశారు. నిజాం రాజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టిస్తే.. నేడు మనం వాటిని కాపాడుకోలే క కబ్జాలపాలు చేశాం” అని అన్నారు. 

మూసీ కాలుష్యం వల్ల ఎక్కువగా నష్టపోయింది.. శిక్ష అనుభవి స్తున్నది నల్గొండ జిల్లా ప్రజలే. గత పాలకుల చేసిన పాపం.. నల్గొండకు శాపంగా మారింది. మూసీలో కలుస్తున్న డ్రైనేజీ నీళ్లు, ఫార్మా కంపెనీల రసాయనాలు, పశువుల కళేబరాలు, చివరికి ఆసుపత్రుల వ్యర్థాలు.. నల్గొండకు విషాన్ని మోసుకెళ్తున్నాయి. ఈ కలుషిత నీటి ప్రభావంతో  అక్కడి ఆడబిడ్డలు గర్భం దాల్చడం లేదు. ఒకవేళ పిల్లలు పుట్టినా అంగవైకల్యంతో పుడుతున్నారు. ‘మాకు ఇంకేమీ చేయకున్నా పర్లేదు.. మూసీని బాగు చేయండి చాలు’ అని భువనగిరి పాదయాత్రలో వేలాది మంది నన్ను వేడుకున్నారు. వాళ్ల గోస తీర్చడానికే నేను ఈ ప్రాజెక్టును భుజాన వేసుకున్నాను” అని తెలిపారు. 

అక్కడ ఒప్పు.. ఇక్కడ తప్పా? 

గంగా,  యమునా, సబర్మతి నదుల ప్రక్షాళనను సమర్థించిన రాష్ట్ర బీజేపీ నేతలు.. మూసీ ప్రక్షాళనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘గుజరాత్‌‌‌‌‌‌‌‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ను బీజేపీ గొప్పగా చెప్పుకుంటున్నది. అక్కడ 60 వేల కుటుంబాలను తరలించారు. ఢిల్లీలో యమునా నదిని, యూపీలో గంగా నదిని ప్రక్షాళన చేస్తున్న బీజేపీ.. ఇక్కడ మూసీ ప్రక్షాళనను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నది. అక్కడ పేదలను తరలిస్తే అభివృద్ధి అంటారు.. ఇక్కడ పేదలను తరలించి, మంచి ఇండ్లు ఇస్తామంటే అడ్డుకుంటారా?’’ అని నిలదీశారు.

అసొంటోళ్లను ఉపేక్షించేది లేదు.. 

అక్రమ కట్టడాలు, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ల విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘‘జన్వాడలో, మొయినాబాద్‌‌‌‌లో ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు కట్టుకున్న అపర కుబేరుల డ్రైనేజీలు గండిపేటలో కలుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? వారిపై ఉక్కుపాదం మోపినం.. అందుకే రూ.కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేస్తున్నారు. అయినా నేను వెనక్కి తగ్గను. పేదలకు మేలు జరగాలన్నదే నా సంకల్పం. రూ.50 వేల కోట్లు ఖర్చు పెడితే, అందులో రేవంత్ రెడ్డికి కమీషన్లు వస్తాయని ఆరోపిస్తు న్నారు. మేం 80 వేల పుస్తకాలు చదవలేదు.. కానీ నిజాయతీగా పని చేయడం తెలుసు. కన్సల్టెంట్ కంపెనీలు డీపీఆర్ ఇవ్వకముందే అంచనాలు ఎలా వేస్తారు? రాబోయే ఐదేండ్లలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మారుస్తాం. ఇది నాలుగు నదుల (మూసీ, ఈసా, గోదావరి, కృష్ణా) అనుసంధాన యజ్ఞం.. దీన్ని విజయవంతం చేసి తీరుతాం’’ అని చెప్పారు.