ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పు.. పెళ్లైన కూతురుకు కారుణ్య నియామకం

ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పు.. పెళ్లైన కూతురుకు కారుణ్య నియామకం

ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. తండ్రి చనిపోతే పెళ్లైన కూతురు కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నమ్మ అనే మహిళ ఈ పిటిషన్ వేసింది. చిన్నమ్మ భర్త ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయన 2009లో చనిపోయాడు. దాంతో చిన్నమ్మ కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకుంది. అయితే చిన్నమ్మకు సరైన అర్హతలు లేవంటూ ఆమె దరఖాస్తును ఆర్టీసీ యాజమాన్యం తిరస్కరించింది. ఈ క్రమంలో చిన్నమ్మ.. తనకు కాకపోతే తన కూతురు దమయంతికి అయినా ఆ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించుకుంది. అయితే దమయంతికి వివాహం కావడంతో ఆమె అర్హురాలు కాదని ఆర్టీసీ మరోసారి చిన్నమ్మ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో చిన్నమ్మ 2014లో హైకోర్టును ఆశ్రయించింది. 


కాగా.. ఉద్యోగి మరణిస్తే బ్రెడ్ విన్నర్ స్కీం కింద వారి కుమారుడు లేదా అవివాహిత అయిన కూతురికి మాత్రమే ఉద్యోగ కల్పన ఉంటుందని ఆర్టీసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలు విన్న న్యాయమూర్తి.. 1999లో జారీ చేసిన 350 జీవో ప్రకారం కూతురు వివాహిత అయినా ఉద్యోగ కల్పన ఉంటుందని 2003లో ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు. కారుణ్య నియామకాల్లో కొడుకు ఎంతో, కూతురు‌ కూడా అంతేనని జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యానించారు. కూతుళ్ళకు పెళ్లయినా తల్లిదండ్రులతో అనుబంధం విడదీయరానిదని కోర్టు పేర్కొంది. కూతుళ్లు కుటుంబ బాధ్యతలు కూడా మోస్తున్నారని.. తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు చేస్తున్న వారిని కూడా చూస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. అవివాహితలకే కారుణ్య నియామకాలనే నిబంధన ఇకపై చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. చిన్నమ్మ‌ అభ్యర్థనను‌ పరిగణనలోకి తీసుకుని.. దమయంతికి ఉద్యోగం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.