- విభజనచట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే కేటాయింపులుండాలి
- కృష్ణా జలాలపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదన
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో నీటి వాటాలపై ఏపీ మరోసారి అడ్డంగా వాదించింది. తెలంగాణకు సమాన వాటాలను ఇవ్వడానికి లేదని పేర్కొంది. ఇప్పటికే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్1 (బచావత్), కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్2 (బ్రజేశ్ కుమార్)లు నీటి వాటాలను కేటాయించేశాయని తెలిపింది.
బచావత్ అవార్డు ఇప్పటికే అమల్లో ఉండగా.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినా ఇంకా అమల్లోకి రాల్లేదని పేర్కొంది. ఇప్పుడు వాదనలు వింటున్నది కేడబ్ల్యూడీటీ2 అయినా.. ఇది మూడో ట్రిబ్యునల్ కిందే లెక్కకు వస్తుందని వాదించింది. ఈ నేపథ్యంలోనే తొలి రెండు ట్రిబ్యునళ్లు ఇచ్చిన అవార్డులను మూడో ట్రిబ్యునల్ మార్చడానికి లేదని అడ్డంగా వాదించింది.
మంగళవారం కృష్ణా జల వివాదాలపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా తెలంగాణకు క్లీన్ స్లేట్ థియరీ (కేటాయింపులు కాకముందు ఉన్న నీళ్ల నుంచి) ప్రకారం సమాన వాటాలను ఇవ్వలేమని ఏపీ తేల్చి చెప్పింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 పరిధి మేరకే కేటాయింపులుంటాయని, సెక్షన్ 89ను మార్చడానికి లేదని తేల్చి చెప్పింది. కనుక ఆ సెక్షన్ ప్రకారం ఇచ్చిన కేటాయింపులను మార్చడానికి లేదని స్పష్టం చేసింది.
నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, చెన్నై వాటర్ సప్లై స్కీమ్వంటి కామన్ ప్రాజెక్టులకు ఓ సమగ్రమైన పద్ధతి ద్వారా నీటి కేటాయింపులను చేసే అవకాశం ఉందని పేర్కొంది. షెడ్యూల్11లోని ప్రాజెక్టుల అలకేషన్స్ను మార్చలేరని తెలిపింది. అయితే, ఇవన్నీ అయిపోయాక మిగతా వాటర్ ఏవైనా ఉంటే.. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయవచ్చని వాదించింది.
అంతేగాకుండా బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్ 11 ప్రకారం తుంగభద్ర డ్యామ్ వాటాల కేటాయింపులనూ మార్చడానికి లేదని తెలిపింది. హైలెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, ఆర్డీఎస్, కేసీ కెనాల్‌కు ఉన్న కేటాయింపులు యథావిధిగా ఉంటాయని స్పష్టం చేసింది.
