ఐపాడ్​ గొంతు ఆగిపోతోంది..

ఐపాడ్​ గొంతు ఆగిపోతోంది..

న్యూయార్క్​: యాపిల్​కు ఒకప్పుడు భారీగా డబ్బు సంపాదించిపెట్టిన​ ‘ఐపాడ్’ గుర్తుందా ? అద్భుతమైన మ్యూజిక్​ క్లారిటీ ఇచ్చే ఈ డివైజ్​ను ఇప్పుడు చాలా తక్కువ మందే వాడుతున్నారు. అమ్మకాలు పడిపోవడంతో యాపిల్​ఐపాడ్​ను వదిలేస్తోంది.  ఇది 20 ఏళ్ల క్రితం మొదటి ఐపాడ్​ను లాంచ్​ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఏడో జెనరేషన్​ ఐపాడ్ అమ్ముడవుతోంది. ఐపాడ్​ సిరీస్​లో ఇదే చివరి ఎడిషన్​ అని, ఇక నుంచి కొత్త వెర్షన్లు రాబోవని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘యాపిల్​కు చాలా ముఖ్యమైన వాటిలో మ్యూజిక్‌ ఒకటి. ఐపాడ్​ ద్వారా మేం కోట్లాది మందికి క్వాలిటీ మ్యూజిక్​ను అందించాం. మ్యూజిక్​ ఇండస్ట్రీకి కూడా ఎంతో మేలు జరిగింది”అని సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ గ్రెక్​ జాస్​వియాక్​ చెప్పారు. 2001 అక్టోబరు 23న ఐపాడ్​ ను యాపిల్​ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది వెయ్యి పాటలను వినిపించేది. ఒక్కసారి చార్జ్​ చేస్తే 10 గంటలపాటు పనిచేసేది. దీనికి పోటీగా చాలా కంపెనీలు మ్యూజిక్​ ప్లేయర్లను లాంచ్​ చేశాయి.  

ఇప్పుడున్న వెర్షన్ - ఐపాడ్ టచ్ - 2007లో ఐఫోన్ లాంచ్ అయినప్పుడే వచ్చింది. ఈ ఐపాడ్‌‌కి  సొగసైన 3.5- అంగుళాల వైడ్ స్క్రీన్ డిస్‌‌ప్లే కూడా ఇచ్చారు. ఇక యాపిల్ ఐపాడ్ మినీ ఫిబ్రవరి 20, 2004న మార్కెట్లోకి వచ్చింది.  ఐపాడ్ నానో (2 జెనరేషన్​) సెప్టెంబరు 25, 2006న వచ్చింది. ఇది చాలా సన్నగా, మిరుమిట్లు గొలిపే రంగులతో కస్టమర్లను ఆకట్టుకుంది. 24 గంటల బ్యాటరీ లైఫ్​ను. ఇందులో 2,000 పాటలను స్టోర్​ చేసుకోవచ్చు. 2015 జూలై 15న యాపిల్​ ఐపాడ్​ షఫుల్ (4వ జెనరేషన్​)తో మార్కెట్లోకి వచ్చింది. మ్యాగ్జిమమ్​ 15 గంటల బ్యాటరీ లైఫ్, 2జీబీ స్టోరేజీ,  వాయిస్‌‌ఓవర్ బటన్‌‌తో, సొగసైన డిజైన్‌‌, ప్లే లిస్ట్​ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. యాపిల్ 2015 నుంచి ఐపాడ్ అమ్మకాల వివరాలను ప్రకటించడం మానేసింది. ఐపాడ్​ తయారీని నిలిపివేస్తామన్న యాపిల్​ ప్రకటన చాలా నిరాశ కలిగించిందని పలువురు ట్వీట్లు చేశారు. ఇప్పటికీ దీనిని వాడుతున్నామని కొందరు చెప్పారు. ఐపాడ్​ను మాత్రమే తొలగిస్తున్నామని, తమ మ్యూజిక్​ సర్వీసులను ఎప్పట్లాగే ఐఫోన్​, ఐప్యాడ్​, మ్యాక్​, హోమ్​పాడ్​ మినీ వంటి అన్ని డివైజ్​లలో వాడుకోవచ్చని యాపిల్​ అంటోంది.