హైదరాబాద్, వెలుగు: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' సిద్ధమైంది. వచ్చే ఏడాది నాటికి నెలకు ఒక రాకెట్ తయారు చేసి ప్రయోగించే స్థాయికి చేరుకుంటామని సంస్థ సీఈఓ పవన్ కుమార్, కో–ఫౌండర్ నాగ భరత్ వెల్లడించారు.
దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను ఈ ఏడాది జూన్‌లో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. ఈ రాకెట్ భాగాలను శ్రీహరికోటకు తరలించే ప్రక్రియను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించిన సందర్భంగా వీళ్లు మీడియాతో మాట్లాడారు.
ఇది తొలి ప్రయోగం కాబట్టి కేవలం కొన్ని పరికరాలు, సెన్సర్లతో టెస్ట్ లాంచ్ నిర్వహిస్తామని, తదుపరి ప్రయోగాల్లో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహాలను పంపిస్తామని వెల్లడించారు. ఈ రాకెట్ తయారీలో 90 శాతం కంటే ఎక్కువ భాగాలను భారత్‌లోనే సేకరించామని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా (100 మిలియన్ డాలర్లు) సేకరించామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లు కాగా, 2035 నాటికి ఇది 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పవన్ వివరించారు.

