- వార్షికంగా 27 శాతం పెరుగుదల
- మొదటి స్థానంలో మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: ఆటో సెక్టార్ ప్యాసింజర్ వెహికల్స్ (పీవీల) అమ్మకాల్లో అద్భుతమైన వృద్ధి నమోదైంది. పోయిన నెల సుమారు 4.5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు అంచనా. 2025 ఏప్రిల్లో 3.54 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. అంటే ఏకంగా 27 శాతం వృద్ధి నమోదైంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా సంస్థల రికార్డు స్థాయి అమ్మకాలు ఈ పురోగతికి తోడ్పడ్డాయి. జీఎస్టీ 2.0 సానుకూల ప్రభావం, రెపో రేటు తగ్గింపు, ఆదాయపు పన్ను ప్రయోజనాలు అమ్మకాల జోరును కొనసాగించాయి.
మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో 1,91,122 యూనిట్ల విక్రయాలను సాధించింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఈ సంస్థ 1,42,053 యూనిట్లను అమ్మింది. 2025 డిసెంబరులో నమోదైన 1,82,165 యూనిట్లే ఇప్పటి వరకు అత్యధికం కాగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్ల అమ్మకాలు 74.4 శాతం పెరిగాయి.
రెండో స్థానంలో టాటా మోటార్స్
టాటా మోటార్స్ ఈసారి 59 వేల యూనిట్లు విక్రయించింది. గత ఏప్రిల్లో అమ్మిన 45,199 యూనిట్ల కంటే ఇది 30.5 శాతం ఎక్కువ. మహీంద్రా 56,331 యూనిట్లను విక్రయించి 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ 51,902 యూనిట్ల విక్రయాలతో 17 శాతం వృద్ధి సాధించింది. ఈ సంస్థ చరిత్రలో ఏప్రిల్ నెలలో ఇవే అత్యధిక అమ్మకాలు! కియా 27,286 యూనిట్లను విక్రయించి 16 శాతం పురోగతి సాధించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 30,159 యూనిట్ల అమ్మకాలతో 21 శాతం వృద్ధి నమోదు చేసింది.
ఎంజీ మోటార్ 6,018 యూనిట్లు, రెనాల్ట్ 5,413 యూనిట్లు, నిస్సాన్ 3,203 యూనిట్లను అమ్మాయి. రెనాల్ట్ గత ఏడాదితో పోలిస్తే రెండు రెట్ల వృద్ధిని సాధించింది. టూవీలర్స్ విభాగంలో హీరో మోటో కార్ప్ అదరగొట్టింది. దీని అమ్మకాలు 85 శాతం పెరిగి 5.66 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. హోండా 4.84 లక్షల యూనిట్లను అమ్మగలిగింది. గత ఏప్రిల్లో జరిగిన 4.22 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 14.7 శాతం ఎక్కువ. రాయల్ ఎన్‌ఫీల్డ్ 1,04,129 యూనిట్లను విక్రయించి 37 శాతం వృద్ధిని సాధించింది.
