కాకతీయ కెనాల్​లో .. హెడ్ కానిస్టేబుల్ గల్లంతు

కాకతీయ కెనాల్​లో ..  హెడ్ కానిస్టేబుల్ గల్లంతు

తిమ్మాపూర్, వెలుగు:  కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలంలోని  అలుగునూర్ శివారులో గల కాకతీయ కెనాల్​లో పడి ఏఆర్​ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దుండే మల్లయ్య(50) గల్లంతయ్యాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ లోని  భగత్ నగర్ లో  నివాసముంటున్న మల్లయ్య  పెద్దపల్లి జిల్లాలో డ్యూటీ చేస్తున్నారు. శుక్రవారం పొద్దున ఇంటికి వచ్చిన మల్లయ్య బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని, ఎస్పీ ఆఫీస్​లో పని ఉందని భార్య హేమలతకు చెప్పి  వెళ్లాడు. 

సాయంత్రం వరకు  ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు  ఫోన్ చేయడంతో  స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే  అతడి స్నేహితులకు ఫోన్లు చేసి సమాచారాన్ని అందించారు.  అయినా ఎలాంటి సమాచారం దొరకలేదు.  దీంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కాగా సాయంత్రం కాకతీయ కెనాల్​ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లిన మల్లయ్య కాల్వలో చేతులు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి అతన్ని కాపాడేందుకు నీటిలో తాడు వేసినప్పటికీ పట్టుకోలేదు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో  నీటిలో కొట్టుకుపోయాడని తెలిపారు.  ఈవిషయం పోలీసులకు, కుటుంబసభ్యులకు తెలిపారు. మల్లయ్యకు ఇద్దరు కూతుళ్లు శ్రీజ, కీర్తన ఉన్నారు.  భార్య హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.