దొంగల ఫోకస్ అంతా ఇప్పుడు బంగారంపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. గోల్డ్ రేట్లు భారీగా పెరగటంతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అనుకుంటున్నారో ఏమో కానీ.. పక్కా ప్లాన్ తో బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. 2026 ఏప్రిల్ 12వ తేదీన కామారెడ్డి టౌన్ లో ఏకంగా 60 లక్షల గోల్డ్, సిల్వర్ ఆభరణాల చోరీ కలకలం రేపింది.
జిల్లా కేంద్రంలోని జన్మభూమి రోడ్డులో ఉన్న సాయి అపార్ట్మెంట్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. 40 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు, ఒక లక్ష రూపాయల నగదు దొంగిలించారు దుండగులు. ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
►ALSO READ | పరిశ్రమల ఏర్పాటుకు పార్టీలకతీతంగా సహకరించాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రాజంపేట మండలం ఎంపిఓ గా పని చేస్తున్న బాలకృష్ణ ఇంట్లో జరిగింది ఈ భారీ దోపిడి. ఆసుపత్రి పనిమీద కుటుంబం అంతా హైదరాబాద్ వెళ్లిన సమయంలో పక్కా ప్లాన్ తో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి, బీరువా తాళం తీసి ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న సొమ్మంతా పోయిందని తెలిసి కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు.
