80 తలలు లేని అస్థి పంజరాలు.. అందరినీ చంపేశారా..? ఆచారంలో భాగంగా తలలు తీసేసి మొండాలను పూడ్చేశారా..?

80 తలలు లేని అస్థి పంజరాలు.. అందరినీ చంపేశారా..? ఆచారంలో భాగంగా తలలు తీసేసి మొండాలను పూడ్చేశారా..?

స్లోవేకియా: ఐరోపా దేశమైన స్లోవేకియాలో 7 వేల ఏళ్ల నాటి ఒక నివాస ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. తలలు లేకుండా పూడ్చిపెట్టిన దాదాపు 80 మానవ అస్థి పంజరాలను వెలికి తీశారు. ఇలా తలలు లేకుండా పూడ్చిపెట్టిన మనుషుల అస్థి పంజరాలు కనిపించడంతో శాస్త్రవేత్తలతో పాటు స్లోవేకియా ప్రజలు విస్తుపోయారు. 

రాతియుగం నాటి ఆచారాల గురించి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతుండటం గమనార్హం. మధ్య ఐరోపాలోని అతిపెద్ద తొలి వ్యవసాయ సముదాయాలలో ఒకటైన వ్రాబ్లే అనే నవీన శిలాయుగ నివాస ప్రాంతం చుట్టూ ఉన్న ఒక కందకంలో ఈ అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

పరిశోధకులు కనీసం 78 మంది వ్యక్తులను గుర్తించారు. కానీ.. ఒక చిన్నారికి చెందిన అస్థిపంజరం మాత్రమే పుర్రె చెక్కుచెదరకుండా ఉంది. ఏదైనా ఒక హింసాత్మక దాడికి లేదా సామూహిక హత్యాకాండకు గురై ఉండవచ్చని ఈ అవశేషాలు సూచిస్తున్నాయి. అయితే.. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఉద్దేశపూర్వకమైన ఆచారంలో భాగంగా మనిషి చనిపోయాక ఆ తలలను తొలగించి పూడ్చి పెట్టి ఉండొచ్చని తెలుస్తుంది.

హింసాత్మక చర్యల వల్ల.. ప్రజలు మరణించారనడానికి తక్కువ ఆధారాలు ఉన్నాయని కీల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. మృతదేహాల నుంచి పుర్రెలను జాగ్రత్తగా వేరు చేసినట్లుగా అస్థి పంజరాలు ఉన్నాయని.. మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై పూర్తి జ్ఞానం ఉన్న వ్యక్తులు ఈ ప్రక్రియను నిర్వహించారని తెలుస్తోంది. కోత గుర్తులు, అవశేషాల అమరిక ఇదొక ఆచారంలో భాగంగా తల, మొండెం వేరు చేసినట్లుగా స్పష్టం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కనిపించకుండా పోయిన పుర్రెలలో ఏ ఒక్కటీ దొరకలేదు.

అంతేకాదు.. అస్థిపంజరాలు అసాధారణ భంగిమలలో కనిపించాయి. కొన్ని బోర్లా పడుకుని ఉండగా, మరికొన్ని జంటలుగా ఉన్నాయి. ఈ ఆవిష్కరణలు రాతియుగం నాటి ఐరోపాలో మరణం, ఖనన పద్ధతుల గురించి దీర్ఘకాలంగా ఉన్న భావనలను సవాల్ చేయడం గమనార్హం.