
హైదరాబాద్, వెలుగు: క్రెడిట్‌కార్డ్ బకాయిలపై మారటోరియాన్ని తీసుకుంటున్నారా? ఈ బకాయిలపై ఎంత వడ్డీ పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ బకాయిలపై మారటోరియాన్ని ఫైనాన్స్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులపై మారటోరియం తీసుకుంటే ‘మినిమమ్ డ్యూ అమౌంట్’ చెల్లించనప్పటికీ ఎటువంటి లేటు ఫీజు ఉండదు. సాధారణంగా బిల్ అమౌంట్‌లో ఐదు శాతం వరకు మినిమమ్ డ్యూ అమౌంట్‌గా పరిగణిస్తారు. మారటోరియం పీరియడ్‌లో వడ్డీనైతే వసూలు చేస్తారు. సాధారణంగా క్రెడిట్‌కార్డ్ బిల్లులో మినిమమ్ డ్యూ అమౌంట్‌ను చెల్లిస్తే ఎటువంటి లేటు ఫీజు ఉండదు. కానీ బాకీ మొత్తం వచ్చే నెల క్రెడిట్ కార్డ్ బిల్లుకు జతవుతుంది. ఈ అమౌంట్‌పై మినిమమ్ 2–4 శాతం వరకు వడ్డీ పడుతుంది. మారటోరియం తీసుకుంటే ఈ మూడు నెలల టైమ్‌లో బకాయిలపై వడ్డీనే 12 శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఈ మారటోరియం టైమ్‌లో కొత్తగా క్రెడిట్‌కార్డ్ ట్రాన్సాక్షన్లను చేస్తే బిల్లింగ్ డేట్ నుంచే వీటిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వడ్డీ ఖర్చులు ఎక్కువవుతాయి.
క్రెడిట్‌కార్డ్ బకాయిలపై వడ్డీని ఇలా లెక్కిస్తారు..
క్రెడిట్‌కార్డ్‌ను ఉపయోగించి రూ. 10 వేల విలువైన ట్రాన్సాక్షన్లు చేశారనుకుందాం. ట్రాన్సాక్షన్ డేట్ మార్చి 1,2020 గా పరిగణిద్దాం. ఈ అమౌంట్‌పై క్రెడిట్‌కార్డ్ స్టేట్‌మెంట్ మార్చి 6 న ఇష్యూ అవుతుంది. లేట్ ఫీజు విధించకుండా ఉండాలంటే బకాయిలను చివరి తేది మార్చి 26, 2020 లోపు చెల్లించాల్సి ఉంటుంది. లేదా బకాయిలో మినిమమ్ డ్యూ అమౌంట్ రూ. 500 చెల్లిస్తే (రూ. 10,000 లో 5 శాతం రూ. 500) బకాయిలపై లేట్ ఫీజు ఉండదు. క్రెడిట్ కార్డ్ బకాయిలపై ఫైనాన్స్ సంస్థలు 3.5 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయని అనుకుందాం. అప్పుడు క్రెడిట్‌కార్డ్ బకాయిలపై వడ్డీని పైన వివరించడమైనది.
మారటోరియం తీసుకోకపోతే..
మొత్తం అమౌంట్ రూ. 10,000 ను మార్చి 25, 2020 లోపు చెల్లిస్తే వడ్డీ ఈ కింది విధంగా లెక్కిస్తారు. మార్చి 1 నుంచి, మార్చి 25 వరకు గల 25 రోజులకు గాను వడ్డీ రూ. 287.7 (25*10,000*3.5%*12/365) గా ఉంటుంది. కాగా వడ్డీని రోజుల పరంగా లెక్కించి, చివరికి ఈ మొత్తాన్ని యాడ్ చేస్తారు. ఈ 25 రోజులకు గాను రూ. 10,000 క్రెడిట్ కార్డ్ బిల్ అమౌంట్‌పై రూ. 287.7 వడ్డీ పడుతుంది. సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్/ స్టేట్‌మెంట్ ఇష్యూ డేట్ నుంచి 20 రోజుల వరకు క్రెడిట్-ఫ్రీ పిరియడ్ ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్‌పై నికరంగా ఎటువంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే వడ్డీ జీరో అన్నమాట.
మారటోరియం తీసుకుంటే..
మారటోరియం తీసుకోవడం వలన క్రెడిట్‌కార్డ్ బకాయిలు చెల్లించే చివరి తేది జూన్ 26, 2020 కి మారుతుంది. కానీ ఈ మూడు నెలల్లోనూ క్రెడిట్‌కార్డ్ స్టేట్‌మెంట్స్ వస్తాయి. కాగా మార్చి 6-ఏప్రిల్ 6, ఏప్రిల్ 6-మే 6, మే 6 -జూన్ 6 కి మధ్య కాలంలో బకాయిలపై వడ్డీ పడుతుంది.
వడ్డీని ఈ విధంగా లెక్కిస్తారు..
- ఆరు రోజులకు వడ్డీ
(మార్చి 1-మార్చి 6): రూ. 69 (6x10000x3.5%x12/365 = 69.04) - 31 రోజులకు వడ్డీ
(మార్చి 7-ఏప్రిల్ 6) : రూ. 357
( 31x10000x3.5%x12/365 = 356.7) - 30 రోజులకు వడ్డీ
(ఏప్రిల్ 7-మే 6) : రూ. 345 (30x10000x3.5%x12/365 = 345.2) - 31 రోజులకు వడ్డీ
(మే 7-జూన్ 6)రూ. 357 (31x10000x3.5%x12/365 = 356.7)
ఈ మూడు నెలల మారటోరియం తర్వాత నికరంగా చెల్లించాల్సిన వడ్డీ : రూ. 69+రూ. 357+ రూ. 345+ రూ. 357= రూ. 1,128. మారటోరియం తర్వాత చెల్లించాల్సిన మొత్తం బకాయిలు=రూ. 10,000 + రూ. 1,128 =రూ. 11,128.