ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌పై వెనక్కి తగ్గిన ఎయిర్‌టెల్.. ఇకపై 'Fast Lane'గా సర్వీస్ రీబ్రాండింగ్

ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌పై వెనక్కి తగ్గిన ఎయిర్‌టెల్.. ఇకపై 'Fast Lane'గా సర్వీస్ రీబ్రాండింగ్

గత నెలలో ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ ప్లాన్ దేశవ్యాప్తంగా పెద్ద నెట్ న్యూట్రాలిటీ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిని అస్త్రంగా మార్చుకుని ప్రత్యర్థి వోడఫోన్ ఐడియా చేసిన యాడ్ క్యాంపెయిన్ దెబ్బకి టెలికాం దిగ్గజం రూట్ మార్చేసింది. ఎక్కువ డబ్బులు కట్టే పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 5G నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ ద్వారా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తామని ఎయిర్‌టెల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎయిర్‌టెల్ సైలెంట్‌గా ఆ ప్లాన్ పేరును ‘ఫాస్ట్ లైన్’గా మార్చి రీబ్రాండింగ్ చేస్తోంది.

ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన వెబ్‌సైట్, మొబైల్ యాప్ నుంచి ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి.. దాని స్థానంలో ‘ఫాస్ట్ లైన్’ బ్రాండింగ్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వాడుతున్న యూజర్ల మొబైల్ స్క్రీన్‌లపై కూడా సర్వీస్ ఇండికేటర్ ఇప్పుడు ఫాస్ట్ లైన్ అనే చూపిస్తోంది. విమర్శలకు భయపడి ఈ ప్లాన్‌ను వెనక్కి తీసుకున్నారనే వార్తలను ఎయిర్‌టెల్ తీవ్రంగా ఖండించింది.

కంపెనీ వివరణ ఏంటంటే..?
ప్లాన్‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని.. కొత్త 5G స్లైసింగ్ ప్లాన్‌కు కస్టమర్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ఎయిర్ టెల్ చెబుతోంది. కేవలం లాంచ్ క్యాంపెయిన్ ముగియడంతోనే తాము అందించే సర్వీస్ సారాంశాన్ని తెలియజేసేలా ‘ఫాస్ట్ లైన్’ అనే పేరును పెట్టామని ఎయిర్‌టెల్ ప్రతినిధి స్పష్టం చేశారు. 5G సపోర్ట్ చేసే డివైజ్ ఉండి.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎంచుకున్న ప్రతి ఒక్కరికీ అపరిమిత డేటా, మెరుగైన స్పీడ్, అద్భుతమైన సేవలు అందుతాయని కంపెనీ చెబుతోంది.

అయితే పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఎక్కువ స్పీడ్ ఇవ్వడం వల్ల తక్కువ డబ్బులు కట్టే ప్రీపెయిడ్ యూజర్ల నెట్‌వర్క్ స్పీడ్ తగ్గిపోతుందనే ఆందోళనలపై కూడా ఎయిర్‌టెల్ క్లారిటీ ఇచ్చింది. ఈ టెక్నాలజీ వల్ల ప్రీపెయిడ్ కస్టమర్ల ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని, దీనికి సంబంధించిన పూర్తి డేటాను టెలికాం రెగ్యులేటరీ TRAIకి సమర్పించినట్లు తెలిపింది. అమెరికా, బ్రిటన్, సౌత్ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఇదే గ్లోబల్ ప్రాక్టీస్ నడుస్తోందని గుర్తు చేసింది కంపెనీ.

నెట్ న్యూట్రాలిటీ రచ్చ.. 
మే 19న ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ తెచ్చినప్పటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. ఒకే నెట్‌వర్క్‌లో డబ్బులు ఎక్కువ ఇచ్చే వారికి ‘ప్రీమియం ఫాస్ట్ లేన్స్’ కేటాయించడం వల్ల ఇంటర్నెట్ సమానత్వ సూత్రాలు దెబ్బతింటాయని విమర్శకులు వాదిస్తున్నారు. దీనిపై ట్రాయ్ ఇంకా నిఘా ఉంచింది.

మరోవైపు తోటి టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా ఈ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. యూజర్ ప్రొఫైల్‌ను బట్టి వేర్వేరు స్పీడులు ఇవ్వడం డిజిటల్ ఈక్విటీకి విరుద్ధమని పేర్కొంది. రిలయన్స్ జియో మాత్రం కాస్త డిఫరెంట్‌గా స్పందిస్తూ.. ప్రస్తుత రూల్స్ ప్రకారం నెట్‌వర్క్ స్లైసింగ్ సేవలు అందించవచ్చని, కానీ ఆ ధరల వ్యత్యాసం పారదర్శకంగా, సాంకేతికంగా సమర్థనీయంగా ఉండాలని టెలికాం శాఖకు లేఖ రాసింది. మొత్తానికి ఎయిర్‌టెల్ పేరు మార్చినా.. ఈ 5G నెట్‌వర్క్ వార్ మాత్రం మరింత హీట్ ఎక్కించేలా ఉంది.