
రాష్ట్రవ్యాప్తంగా పేషెంట్లు ఇక ముందు ఆర్థోపెడిక్ ఆపరేషన్ల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన పనిలేదు. జిల్లా, ఏరియా దవాఖానాల్లోనే మోకాలు మార్పిడి నుంచి అన్నిరకాల ఆర్థో ఆపరేషన్లు చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 41 హాస్పిటళ్లను గుర్తించింది. ఇందులో 6 జిల్లా ఆస్పత్రులుకాగా, 35 ఏరియా దవాఖానాలు ఉన్నాయి. వీటిల్లో ఆర్థోపెడిక్స్ విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లను నిర్మించనుంది. ఒక్కో థియేటర్లో ఆపరేషన్‌కు అవసరమైన సీఆర్మ్ యంత్రాలు, లైట్లు, ఆపరేషన్ టేబుళ్లు ఇతర సామాగ్రి కోసం ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఏమేం మెషీన్లు అవసరం, ఏ సామాగ్రి కొనుగోలు చేయాలన్నదానిపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అధికారులు ఇండెంట్ సిద్ధం చేసి, టీఎస్‌ఎంఐడీసీకి పంపించారు. నెలన్నర వ్యవధిలో దవాఖానాలకు పరికరాలు సరఫరా అయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఇప్పటికే డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, పరికరాలు వచ్చిన వారం పది రోజుల్లోనే.. అంటే రెండు నెలల్లోగా ఆపరేషన్ థియేటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.
ప్రమాద బాధితులకు మేలు
ప్రస్తుతం పలు జిల్లా, ఏరియా హాస్పిటళ్లలో ఆర్థోపెడిక్ డాక్టర్లున్నా.. ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు లేవు. జనరల్ సర్జరీ థియేటర్లలోనే ఆర్థో ఆపరేషన్లు చేస్తున్నారు. తగిన పరికరాలు లేకపోవడంతో వారానికి ఒకట్రెండు సాధారణ ఆపరేషన్లు చేసి.. మిగతా పేషెంట్లను పెద్ద దవాఖానాలకు రిఫర్ చేస్తున్నారు. దీంతో గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటళ్లలో ఆర్థోపెడిక్డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఒక్కో పేషెంట్ ఆపరేషన్ కోసం వారం, పది రోజులు వేచి చూడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఆర్థో ఆపరేషన్లు వీలైనంత త్వరగా చేయాల్సి ఉంటుంది. ఆలస్యమైతే, కాళ్లు, చేతులు తీసేయాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. తీవ్ర గాయాలతో వందల కిలోమీటర్ల ప్రయాణించి, ఆస్పత్రిలో చేరినా వెంటనే ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండటం లేదు. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయం అలాంటివారికి మేలు చేయనుంది.
ఈటల తొలి సంతకం దీనిపైనే..
ఈటల రాజేందర్ వైద్యారోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థో ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద చేస్తున్న ఆర్థో ఆపరేషన్లలో 90% ప్రైవేటు హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయి. ఇందులో కనీసం 50% సర్కారు దవాఖానాల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటల స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏటా ఆరోగ్యశ్రీకి కేటాయిస్తున్న ఆరేడు వందల కోట్ల నిధుల్లో సుమారు రూ.130 కోట్లు ఆర్థో ఆపరేషన్లకే ఖర్చవుతోంది. ఈ 41 దవాఖానాల్లో థియేటర్లు అందుబాటులోకి వస్తే ఈ భారం తగ్గనుంది.