ముంబై : ముంబై టీ20 లీగ్ కోసం శనివారం నిర్వహించిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ఆర్క్స్ అంధేరీ జట్టు రూ. 10 లక్షలకు దక్కించుకుంది. మహిళల విభాగంలో 16 ఏళ్ల ఇరా జాదవ్ రూ. 10 లక్షల ధర పలికి అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఇరాను ఆకాశ్‌ను టైగర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత వచ్చే నెలలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు, మహిళల టీ20 టోర్నీలు జరగనున్నాయి. తొలిసారి నిర్వహిస్తున్న మహిళల లీగ్ వేలం ముగిసిన వెంటనే పురుషుల వేలం కొనసాగింది.
గత కొన్ని సీజన్లుగా గోవా తరపున ఆడుతున్న 26 ఏళ్ల అర్జున్ టెండూల్కర్.. ఏడాది కాలంగా ఏ ఇతర రాష్ట్ర అసోసియేషన్ టీ20 టోర్నీల్లో పాల్గొనలేదు. దీంతో బీసీసీఐ అతడికి ఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చింది. మహిళల విభాగంలో మొత్తం 363 మంది క్రీడాకారిణులు వేలంలో పాల్గొన్నారు.
సోబో ముంబై ఫాల్కన్స్, థానే స్కై రైజర్స్, ఆకాశ్ టైగర్స్ జట్లు మొత్తం రూ. 1.47 కోట్లు ఖర్చు చేసి 50 మంది ఆటగాళ్లను ఎంచుకున్నాయి. భారత అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టు వైస్ కెప్టెన్ సానికా చాల్కేను ఆకాశ్ టైగర్స్ రూ. 5.50 లక్షలకు దక్కించుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడిన సిమ్రాన్ షేక్‌ను ఫాల్కన్స్ జట్టు రూ. 7 లక్షలకు కొనుగోలు చేసింది.
