ప్రయత్నిస్తేనే కదా ఓడిపోతామో, గెలుస్తామో తెలిసేది. అసలు ప్రయత్నమే చేయకుండా మార్పు కోరుకుంటే జరుగుతుందా? అచ్చం ఇలానే అనుకుంది కాబట్టే ఆమె ప్రయత్నించింది.. గెలిచింది. ఆ ప్రయత్నం ఏకంగా ప్రధాన మంత్రి నివాసం ఉన్న స్ట్రీట్ పేరునే మార్చేసింది. అవినీతిని అంతం చేయాలనే మరో ప్రయత్నం మొదలుపెట్టింది. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. భావితరాలకై అవినీతి లేని వ్యవస్థను అందించే ప్రయత్నం చేద్దాం అంటోంది పందొమ్మిదేళ్ల విశ్వానీ గీతానాథ్.
న్యూఢిల్లీ, వెలుగు: గీతానాథ్ డెహ్రాడూన్‌లోని యూనివర్సీటీ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ స్టడీస్‌లో పబ్లిక్ పాలసీ చదువుతోంది. ఆమె సొంతూరు నిజామాబాద్ దగ్గరలోని ఆర్మూర్. తండ్రి శ్రీనాథ్.. సినిమా డైరెక్టర్. తల్లి డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూసర్. గీత చిన్నప్పటినుంచి చాలా చురుకుగా ఉండేది. స్కూల్, కాలేజీల్లో నిర్వహించే ప్రతి ప్రోగ్రామ్‌లో పాల్గొనేది. చదువులో కూడా ముందుండేది. వెయ్యిమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్న ఓ రచయిత మాటలను గీత ఆచరణలో పెట్టింది. డిసెంబర్ 9, ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం. ఆ రోజున సోషల్‌మీడియా వేదికగా ‘కరప్షన్ ఫ్రీ ఎరా’ పేరుతో ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ ఉద్దేశం అవినీతిని అరికట్టడం. పార్లమెంట్ ముందు అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసింది. వర్షంలో తడిసిన వ్యక్తికి రెయిన్ కోట్ ఇవ్వడం కన్నా, తడవకముందే రెయిన్ కోట్ ఇవ్వడం మంచిది అన్నది గీత ఆలోచన. అవినీతి పేరుకుపోయిన ప్రస్తుత సమాజాన్ని మార్చడం అంత ఈజీ కాదు. కాబట్టి రాబోయే తరం అవినీతిని వ్యతిరేకించే విధంగా అవగాహన కల్పించాలన్నదే ఆమె ఆలోచన. ఆ ఆలోచనకు కారణం ఏంటి? తను అసలు ఏం చేయబోతుంది? ఆమె మాటల్లోనే..
‘‘ప్రభుత్వంతో పని చేయించుకోవడం రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు, ఆ హక్కును డబ్బుతో ఎందుకు కొనాలి? దేశం డెవలప్మెంట్కి ప్రధాన ఆటంకం అవినీతే.. అన్నది అందరికీ తెలిసిందే. అయితే డబ్బు రూపంలో జరిగే అవినీతి కన్నా, భయం, బంధు ప్రీతి రూపంలో జరిగే అవినీతే దేశానికి ఎంతో ప్రమాదకరమైనది. అవినీతివల్లే ఏళ్ల తరబడి దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే నేను ఉద్యమం మొదలుపెట్టా. నాతో పాటు నా జనరేషన్ కలిసి నడుస్తుందని నమ్ముతున్నా. సోషల్ మీడియా వేదికగా నా ఆలోచనను దేశ యువతతో పంచుకోవాలని ‘#CorruptionFreeEra’ పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలను క్రియేట్ చేశా. నాతో చేతులు కలపాలి అనుకునేవాళ్లు సోషల్ మీడియాలో ఈ పేజీలని ఫాలో అవుతున్నారు.
ప్రధాని వీధి పేరు మార్పు

భారత ప్రధాని నివాసం ఉండే రోడ్‌కు, గుర్రపు జూదాల రోడ్ (రేస్ కోర్స్) అనే పేరు ఉండేది. దేశ ప్రధాని ఉంటున్న స్ట్రీట్‌కి జూదానికి సంబంధించిన పేరు ఉండడం మంచిగ అనిపించలేదు. అదే విషయాన్ని మా నాన్నకు చెప్పా. అప్పుడాయన ‘ఈ మాట నాకు కాదమ్మా ప్రధానికే చెప్పు’ అన్నారు. ఇంటర్నెట్‌లో అడ్రస్ వెతికి, నా మనసులో మాటలను లెటర్‌గా రాసి ప్రధాని మోదీకి పంపించా. నేను జూన్ 27, 2016 తేదిన లెటర్ రాస్తే, నెల రోజుల తర్వాత దానికి బదులిస్తూ ప్రధాని ఆఫీసు నుంచి ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే, సెప్టెంబర్ 23, 2016న రోడ్డు పేరును ‘7 రేస్ కోర్స్’ నుంచి ‘7 లోక్ కళ్యాణ్ మార్గ్’ అని మార్చారు. బ్రిటిషర్స్ హయాంలో గుర్రపు పందాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ ప్రాంతం, మనదేశం గొప్పతనాన్ని తెలిపేలా లేదన్న కారణంతో పేరు మార్చినట్లుగా న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ‘కరెప్షన్ ఫ్రీ ఎరా’ ఉద్యమం మొదలుపెట్టా.
ఐఎఎస్ కావాలనుంది
చిన్ననాటి నుంచి సివిల్ సర్వీసెస్‌పై ఆసక్తి ఉండేది. టెన్త్ క్లాస్ వరకు ఆటలపై ఎక్కువ ఇష్టం ఉండేది. నేను ఇంటర్మీడియెట్ గండిపేట్‌లోని ఎన్టీఆర్ గర్ల్స్ కాలేజ్ చదివిన. ఆ కాలేజీ నన్ను పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే.. కాలేజీలో ఎప్పుడూ రకరకాల అంశాలపై చర్చలు జరిగేవి. వాటిలో పాల్గొనాలంటే ముందుగా ఆ అంశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లోతైన అవగాహన ఉండాలి. దాని చరిత్ర తెలియాలి. కాబట్టి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నా. ఆ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆలోచనలు మొత్తం మారిపోయాయి. పబ్లిక్ స్పీకర్‌గా అవ్వాలనుకున్నా. అందుకు తగ్గట్లుగానే పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. ఇప్పటివరకు గాంధీజీ, అంబేద్కర్, నెహ్రూ, అబ్దుల్ కలాం వంటి మహనీయుల జీవిత చరిత్రలు చదివా. ఐఎఎస్ కావాలన్నదే నా లక్ష్యం. రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలంటే సివిల్ సర్వీసెస్ ద్వారానే సాధ్యం అవుతుంది’’ అంటోంది గీత.
గర్వంగా ఉంది
అమ్మాయిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఒక్కోసారి తను అడిగే ప్రశ్నలకు మా దగ్గర జవాబు ఉండదు. నేను సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతో సినిమాలు తీస్తా. అందుకే ‘కుబుసం’ సినిమా డైరెక్ట్ చేశా. నాకు డబ్బు ముఖ్యం కాదు.. ప్రజలకు ఏం చెప్తున్నామన్నదే ముఖ్యం. నా పిల్లలకు అదే నేర్పించా. సమాజంలో ఎలాగైనా బతకొచ్చు. కానీ, నలుగురు మెచ్చుకునేలా తలెత్తుకు బతకాలన్నదే నా పాలసీ. దాన్నే గీత అనుసరిస్తోంది. అయితే, గీత మాత్రమే నిజాయితీగా ఉన్నంత మాత్రాన సమాజం మారదు. తానిచ్చిన పిలుపుకు తగ్గట్లుగా నేటి తరం యువత స్పందించాలని కోరుతున్నా. అప్పుడే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించగలం.
–శ్రీనాథ్, గీత తండ్రి
