గద్వాల, వెలుగు: వాహనాల నకిలీ ఇన్సూరెన్స్, ఆర్ సీలు, డ్రైవింగ్ లైసెన్సులు తయారుచేసి అమ్ముకుంటున్న అంతర్ రాష్ట్ర ముఠాను జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ డాక్యుమెంట్స్, కలర్ ప్రింటర్స్, రెండు ల్యాప్టాప్స్, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల లోగోలు ఉన్న డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంపులు, 16 ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్పీ ఆఫీసులో గద్వాల ఎస్పీ సృజన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కర్నూలు టౌన్ కు చెందిన రామస్వామి కొంతకాలంగా వాహనాల ఫేక్ ఇన్సూరెన్స్, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు తయారుచేసి అమ్ముతున్నారన్నారు.
కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, నంద్యాల, అనంతపూర్ లలో ఏజెంట్లను నియమించుకొని వారికి కావలసిన ఇన్సూరెన్సులు, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు నకిలీవి తయారుచేసి ఇచ్చేవారన్నారు. వెహికల్ ఖరీదును బట్టి ఒక్కొక్క ఫేక్ డాక్యుమెంటుకు రూ.1,000 నుంచి 4,000 వరకు వసూలు చేసే వారన్నారు. 50 శాతం అమౌంట్ను ఏజెంట్లకు ఇచ్చే వాడన్నారు. 26న సాయంత్రం సీఐ సూర్య నాయక్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వెహికల్ లో ఫేక్ డాక్యుమెంట్లు భారీగా లభించడంతో ముఠా గుట్టురట్టైందన్నారు.
వారిపై నిఘా పెట్టి రామస్వామితో పాటు కర్నూలు టౌన్ కు చెందిన రవికుమార్, ప్రవీణ్, రఘునాథ్, శ్రీకాంత్, ఈగార్లపాడుకు చెందిన చంద్రకుమార్ ను, గద్వాల్ ఆర్టీఏ ఏజెంట్లు సుధాకర్, విశ్వనాథ్, మధుసూదన్, డోన్ కు చెందిన రంగన్న, మహబూబ్ నగర్ ఆర్టీఏ ఏజెంట్లు ముస్తఫా, సురేశ్ గౌడ్, వనపర్తికి చెందిన ఆర్టీఐ ఏజెంట్ ప్రేమ్ కుమార్, నంద్యాలకు చెందిన నగేశ్, నల్గొండ టౌన్ కు చెందిన లక్ష్మయ్య, ఐజకు చెందిన కిరణ్ కుమార్, కోడుమూరుకు చెందిన మాధవస్వామిలను అలంపూర్ చౌరస్తా, కర్నూలులో అరెస్టు చేశామన్నారు. సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ సూర్య నాయక్, ఉండవల్లి ఎస్ఐ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.