కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌‌కు అరెస్ట్ వారెంట్

కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌‌కు అరెస్ట్ వారెంట్

కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌కు తిరువనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శశి థరూర్ తాను రచించిన పుస్తకంలో హిందూ మహిళలను కించ పరిచినందుకుగాను కోర్టు అరెస్టు వారెంట్ ఇచ్చింది. ఈ అరెస్టు వారెంట్‌ను తిరువనంతపురం చీఫ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి శశి థరూర్ కానీ, ఆయన తరపు లాయర్ కానీ కోర్టులో హాజరుకాకపోవడంతో జడ్జీ ఈ వారెంట్‌ను జారీ చేశారు.

శశి థరూర్ 1989లో రాసిన ‘ది గ్రేట్ ఇండియన్ నావెల్’ పుస్తకంలో హిందూ మహిళలను అగౌరపరచినందుకు ఆయనకు ఈ వారెంట్ జారీ అయింది. అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన శశి థరూర్ కార్యాలయ సిబ్బంది.. తమకు కోర్టు నుంచి ఉత్తర్వు వచ్చింది కానీ, అందులో ఏ తేదీన హాజరుకావాలో చెప్పలేదని సిబ్బంది చెప్పారు. ఉత్తర్వులో తేదీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చినప్పటికీ తాజా సమన్లు ​​పంపలేదని వారన్నారు. అందుకే శశి థరూర్ కోర్టుకు హాజరుకాలేదని వారన్నారు. శశి థరూర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తమకు మీడియా ద్వారా మాత్రమే తెలిసిందని ఆయన కార్యాలయ సిబ్బంది అన్నారు. కొత్త సమన్లు తమకు ఏవీ రాలేదని తమ న్యాయవాది సోమవారం కోర్టు దృష్టికి తీసుకెళ్తారని శశి థరూర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.