- మూడు నెలలు దాటినా నెరవేరని ప్రభుత్వ హామీలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు మళ్లీ పోరుబాట పట్టారు. మూడు నెలలు దాటినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్‌లోని దక్షిణ డిస్కం సీఎండీ ఆఫీస్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి ఆర్టిజన్ కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ కన్వీనర్ ఎస్.సాయిలు మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో తాము 8 రోజులు సమ్మె చేయగా, సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, కానీ ఆ ప్రామిస్ నేటికీ నెరవేరలేదని చెప్పారు. సమ్మె విరమించిన తర్వాత ప్రభుత్వం, హై అఫీషియల్స్ తమను అస్సలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ సర్కారు 23,600 మంది కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి ఏపీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయకుండా, 1947 నాటి ఐడీ యాక్ట్ స్టాండింగ్ ఆర్డర్స్ అమలు చేసి అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్లకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించినా ట్రాన్స్కో సీఎండీ తమ సమస్యలను సాల్వ్ చేయలేదని వాపోయారు.
స్పందించకపోతే మళ్లీ సమ్మె !
ట్రాన్స్కో సీఎండీ తన చేతిలో ఏమీ లేదనగా, విద్యుత్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తమను తక్కువ చేసి మాట్లాడారని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో మరోసారి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీశ్ రెడ్డి, కో చైర్మన్ సుదాగని శ్రీధర్ గౌడ్, కన్వీనర్ చంద్రారెడ్డి, కో కన్వీనర్ చందర్ సింగ్, వైస్ చైర్మన్లు సంతోష్ నాయక్, చింతల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
