కామారెడ్డి జిల్లాలోకి రాహుల్​ పాదయాత్ర

కామారెడ్డి జిల్లాలోకి రాహుల్​ పాదయాత్ర
  • వణికించే చలిలోనూ ఉత్సాహంగా కాంగ్రెస్ నేత రాహుల్​ పాదయాత్ర

  • కామారెడ్డి జిల్లాలోకి ఎంట్రీ

మెదక్, వెలుగు: వణుకు పుట్టించే చలిలో ఆదివారం ఉదయం ఆరు గంటలకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా పాదయాత్ర ప్రారంభించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ నుంచి పెద్దశంకరంపేట్ మండలం కమలాపూర్ వరకు 13 కిలోమీటర్లు నడిచారు. విరామం తర్వాత నారాయణ్ ఖేడ్ మండలం నిజాంపేట్ వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి జిల్లా బార్డర్‌‌లోని మహాదేవ్ పల్లి వరకు యాత్ర కొనసాగించారు. దారి పొడవునా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద జెండాలు, నాగళ్లతో రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన అడుగులో అడుగేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యలో ఆయా గ్రామాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు రాహుల్‌ను చూసేందుకు ఆసక్తి చుపారు. పలు చోట్ల మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ.. కొల్లపల్లి వద్ద యాత్రలో జాయిన్ అయ్యారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

సమస్యలు చెప్పుకున్న కార్మికులు

బీడీ కార్మికులు, చెరుకు రైతులు, సింగరేణి కార్మికులు కలిసి తమ సమస్యలను రాహుల్‌కు విన్నవించారు. ఈనెల 2వ తేదీన సంగారెడ్డి జిల్లా లింగంపేట్ వద్ద మొదలైన జోడో యాత్ర.. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఐదు రోజుల పాటు దాదాపు 90 కిలోమీటర్ల మేర కొనసాగి సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలం మాసాన్ పల్లి వద్ద ముగిసింది. అక్కడి నుంచి రాహుల్ గాంధీ కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడప్ గల్‌కు వెళ్లారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు మాణిక్కం ఠాగూర్, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, టి.సుబ్బిరామి రెడ్డి, సురేష్ షేట్కార్, సీతక్క, 
జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సంపత్ తదితరులు ఉన్నారు.