ఎన్నికలున్న రాష్ట్రాలకే ప్రాజెక్టులా?

ఎన్నికలున్న రాష్ట్రాలకే ప్రాజెక్టులా?

రాష్ట్ర ప్రతిపాదనలన్నీ కేంద్రం పక్కన పెడుతోంది: కేటీఆర్
 పరిశ్రమల ఏర్పాటుకు సాయం చేయాలన్నా సప్పుడు లేదు
కోచ్​ ఫ్యాక్టరీ కోసం ఎండోమెంట్​ భూములు కొనిచ్చినా స్పందనలేదు
కో ఆపరేటివ్‌‌‌‌ విధానంలో నిజాం షుగర్స్‌‌‌‌ నడిపేందుకు సిద్ధం 


తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌‌‌‌  ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌ నగరాభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు సాయం చేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. మన రాష్ట్రం ఇవ్వాలని కోరిన ప్రాజెక్టులను ఎన్నికలున్న రాష్ట్రాలకు మళ్లించిందని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌‌‌‌పై పద్దులపై ఆయన సమాధానమిచ్చారు. హైదరాబాద్​ వరదలప్పుడు కేంద్రాన్ని తక్షణ సాయం అడిగినా పైసా ఇవ్వలేదన్నారు. నాలా డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం చేపట్టే చర్యలకు సాయం చేయాలని అడిగినా, దానికి ఏ స్కీం కింద సాయం చేయడం సాధ్యం కాదని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల తర్వాత వరద సాయం ఇవ్వలేదన్న ఆరోపణలు కరెక్ట్‌‌‌‌ కాదని, మొత్తం 6.60 లక్షల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున వరద సాయం చేశామని తెలిపారు. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల తర్వాత రూ. 69 కోట్లు బాధితులకు అందజేశామన్నారు. హైదరాబాద్‌‌‌‌ను 104 ఏండ్ల తర్వాత భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని, మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు స్ట్రాటజిక్‌‌‌‌ నాలా డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రోగ్రాం తీసుకువచ్చామని చెప్పారు. హైదరాబాద్​కు రాబోయే 30 ఏండ్ల అవసరాలకు సరిపడా నీటి వనరులు సృష్టిస్తున్నామన్నారు. హైదరాబాద్‌‌‌‌ నగర అభివృద్ధికి గత ఆరేండ్లలో రూ. 67 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
 
కోచ్​ ఫ్యాక్టరీ కోసం ఎండోమెంట్​ భూములు కొనిచ్చినం

వరంగల్‌‌‌‌లో రైల్‌‌‌‌ కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ పెడతామంటే, ఎండోమెంట్‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు రూ. 350 కోట్లు చెల్లించి 150 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించామని కేటీఆర్​ అన్నారు. అయినా ఇక్కడ కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదని కేంద్ర మంత్రి చెప్తున్నారని మండిపడ్డారు. కానీ మరఠ్వాడ ప్రాంతంలో మాత్రం కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారన్నారు. ఇండస్ట్రియల్‌‌‌‌ కారిడార్లు ఇవ్వాలని కోరినా, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌కైనా సాయం చేయాలన్నా కేంద్రం స్పందించడం లేదని, విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వ్యాక్సిన్‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ ఇవ్వాలన్నా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్‌‌‌‌ మెట్రో రైల్‌‌‌‌ ఫేజ్‌‌‌‌-2కు సాయం చేయాలన్నా స్పందించలేదని విమర్శించారు. 
 
కాంగ్రెస్​కు సంస్కారం లేదు

మూడేండ్లల్లో కాళేశ్వరం లాంటి భారీ లిఫ్ట్‌‌‌‌ స్కీంను పూర్తి చేసిన ప్రభుత్వాన్ని అభినందించాలన్న సంస్కారం కాంగ్రెస్‌‌‌‌కు లేదని కేటీఆర్​ విమర్శించారు. కరీంనగర్‌‌‌‌, వరంగల్‌‌‌‌, ఖమ్మం కార్పొరేషన్‌‌‌‌లలో హైదరాబాద్‌‌‌‌ మాదిరిగానే డిజాస్టర్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు గ్రీన్‌‌‌‌ కవర్‌‌‌‌ పెంచడాన్ని ప్రాధాన్యంగా పెట్టుకున్నామని వివరించారు. 11 మున్సిపాలిటీల్లో బయో వేస్టేజీ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. జర్నలిస్టులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందున్నదని తెలిపారు. ఇండ్ల స్థలాలపై సుప్రీం కోర్టులో కేసు ఉండటంతో ఇవ్వలేకపోయామని చెప్పారు. సీఎం కేసీఆర్‌‌‌‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

తమిళనాడు మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెట్టిన్రు

దేశంలో పండే పసుపులో తెలంగాణలోనే 30 శాతానికి పైగా వాటా ఉందని, అయినా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని కేటీఆర్​ విమర్శించారు. ఇక్కడికి బోర్డు తీసుకువస్తామంటూ బీజేపీ రాసిచ్చిన బాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌ పత్తా లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఇప్పుడు బీజేపీ తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం పసుపు బోర్డు పెడుతామని పేర్కొందని ఆయన అన్నారు. రైతులే ముందుకొచ్చి సహకార విధానంలో నిజాం ఫ్యాక్టరీ నడుపుకుంటామంటే తాము సిద్ధంగా ఉన్నామని గతంలోనే సీఎం కేసీఆర్‌‌‌‌ సభలో చెప్పారని ఆయన అన్నారు.  సహకార విధానంలో నడిపే ఆ ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యే జీవన్‌‌‌‌ రెడ్డినే  చైర్మన్‌‌‌‌గా ఉండాలని సభలో సీఎం సూచించారని పేర్కొన్నారు.  ఇప్పటికీ రైతులు ఇందుకు సిద్ధమైతే షుగర్‌‌‌‌ ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం 17 శాతం వృద్ధి సాధించిందని, దేశం సగటుతో పోల్చితే డబుల్‌‌‌‌ కన్నా ఇది ఎక్కువని కేటీఆర్​ పేర్కొన్నారు.