న్యూఢిల్లీ: నీట్ రీ ఎగ్జామ్ కారణంగా ప్రధాని మోడీ 45 నిమిషాల పాటు ఢిల్లీ ఎయిర్ పోర్టులో వెయిట్ చేశారు. ప్రధాని మోడీ తన విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం (జూన్ 21) మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2:00 గంటలకు నీట్ రీ-టెస్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే కీలక సమయంలో తన కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ జామ్ కాకూడదని మోడీ ఎయిర్ పోర్టులోనే ఆగిపోయారు.
దాదాపు 45 నిమిషాలు విమానాశ్రయంలోనే వెయిట్ చేశారు. 2 గంటలకు నీట్ ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత ఆయన ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లారు. మీటింగ్స్, వివిధ పనులతో బిజీ బిజీగా గడిపే ప్రధాని.. విద్యార్థులకు తన వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావొద్దని దాదాపు 45 నిమిషాలు ఎయిర్ పోర్టులో వెయిట్ చేయడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
నీట్ రీ ఎగ్జామ్ స్టార్ట్
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్ యూజీ' రీ- ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) దేశ, విదేశాల్లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగుతోంది. 2026, మే 3న జరిగిన నీట్ పరీక్షపై పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. దీనికి దేశ వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, దేశంలోనే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్తాన్లోని కోటాలో ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
►ALSO READ | బేడీలు తెంచుకున్న బెంగాల్..బార్డర్ ఫెన్సింగ్ వేగవంతం.. అవినీతిపై ఉక్కుపాదం: ప్రధాని మోదీ
గత పరీక్షలో కోటా నుంచి 38,614 మంది రాయగా.. ఈసారి ఆ సంఖ్య 32,715 కి పడిపోయింది. పేపర్ లీక్ గందరగోళం తర్వాత విద్యార్థులు తమ సొంత ఊర్లకు దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. కోటాలోని 92 పరీక్షా కేంద్రాలతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు.. సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక పోలీసు బృందాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
