- వోలటాలిటీ పెరగడంతో ఈక్విటీలకు దూరంగా ఉంటున్న ఇన్వెస్టర్లు
- డెట్ ఫండ్స్‌లోకి ఏప్రిల్‌లో రూ.2.19 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో
- ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చింది రూ.1,348 కోట్లే
- 197 శాతం పెరిగిన గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు నష్టపోతుండడంతో ఇన్వెస్టర్లు బాండ్లు, గోల్డ్ వంటి స్టేబుల్ అసెట్స్ వైపు చూస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇండియా మార్కెట్ నుంచి నికరంగా రూ.1.9 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. కానీ, ఒక్క ఏప్రిల్‌లోనే డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.2.19 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో జరిగింది.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ డేటా ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో మార్చిలో డెట్ ఫండ్స్ నుంచి రూ.2.02లక్షల కోట్ల ఔట్ ఫ్లో ఉండగా, ఏప్రిల్‌లో రివర్స్ అయి భారీగా ఇన్‌ఫ్లోలు జరిగాయి. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఏప్రిల్‌లో నికరంగా రూ.1,348 కోట్ల ఇన్‌ఫ్లోలే వచ్చాయి. స్టాక్ ఎక్స్చేంజ్‌ల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ల ఆధారంగా ఈ డేటా ఉంది.
ఎఫ్‌పీఐలు వెళ్లిపోతుండడంతో ఈక్విటీ స్కీమ్స్‌లో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్‌లో వోలటాలిటీ ఎక్కువగా ఉండటంతో దేశీయ ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకోవడానికి డెట్ ఫండ్స్ వైపు చూస్తున్నారు. ఇన్వెస్టర్లను లిక్విడ్, ఓవర్‌నైట్ ఫండ్స్ వంటి షార్ట్ టర్మ్ స్కీమ్స్ ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
ఆర్‌బీఐ రెపో రేట్‌ను స్థిరంగా ఉంచినా, గ్లోబల్ బాండ్ యీల్డ్స్ పెరుగుతుండటంతో డెట్ ఫండ్స్ తక్షణ రాబడి ఇచ్చే ప్రత్యామ్నాయంగా మారాయి. ఈక్విటీ స్కీమ్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌ల ద్వారా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ డెట్ ఫండ్స్‌లో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తాల్లో ఒకేసారి పెట్టుబడులు పెడుతున్నారు.
గోల్డ్‌పై మక్కువ
ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో ఇండియాలో బంగారం డిమాండ్ 10 శాతం పెరిగింది. ఇందులో కూడా నగల కంటే పెట్టుబడులకు ఎక్కువ డిమాండ్ ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ప్రకారం, స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉండడంతో గోల్డ్, సిల్వర్ వంటి కమోడిటీల్లో ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కిందటేడాది 159 శాతం పెరిగిన వెండి ధర, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో సుమారు 10 శాతం పెరిగింది. బంగారం ధరలు కిందటేడాది 73 శాతం ఎగిశాయి. ఈ ఏడాది 12 శాతం లాభపడ్డాయి. మంచి రిటర్న్స్ ఇస్తుండడంతో ఇన్వెస్టర్లను ఇవి ఆకర్షిస్తున్నాయి. బంగారం, బాండ్లు, కమోడిటీల్లో పెట్టుబడి పెట్టడం పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్‌లో సహజమని బ్రోకరేజ్ సంస్థ శూన్య ఫౌండర్ సర్వజీత్ సింగ్ విర్క్ అన్నారు.
అయితే, బాండ్లు రిటైల్ ఇన్వెస్టర్లకు ఇంకా తక్కువగానే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి–మార్చిలో బంగారం ఈటీఎఫ్‌లకు డిమాండ్ ఏడాది లెక్కన 197 శాతం పెరిగి 19.9 టన్నులకు చేరింది. విలువ పరంగా ఇది 437 శాతం పెరిగి రూ.30 వేల కోట్లకు ఎగిసింది.
డబ్ల్యూజీసీ ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ మాట్లాడుతూ, గ్లోబల్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం, మార్కెట్ వోలటాలిటీకి హెడ్జ్‌గా బంగారం మీద విశ్వాసం పెరుగుతోందన్నారు. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ రాబోయే క్వార్టర్లలో ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత గోల్డ్‌లోకి భారీగా పెట్టుబడులు రాలేదని, సేఫ్ హెవెన్ అసెట్‌గా నిలవలేదని, ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సర్వజీత్ తెలిపారు.
