మేం పోటీలో లేని చోట బీఆర్ఎస్​కే ఓటెయ్యాలి: అసదుద్దీన్‌ ఒవైసీ

మేం పోటీలో లేని చోట బీఆర్ఎస్​కే ఓటెయ్యాలి: అసదుద్దీన్‌ ఒవైసీ
  • 9 సీట్లలో మజ్లిస్ పోటీ
  • ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్‌ ఒవైసీ 
  •     ఇద్దరు సిట్టింగ్​లకు నో టికెట్ 
  •     3 సీట్లలో అభ్యర్థుల పేర్లు పెండింగ్‌
  •     ప్రకటించిన స్థానాల్లో కొత్తగా ఇద్దరికి చాన్స్‌
  •     మేం పోటీలో లేని చోట బీఆర్ఎస్​కే ఓటెయ్యాలి: అసద్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి మజ్లిస్ సిద్ధమైంది. పోయిన ఎన్నికల్లో గెలుచుకున్న ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు ఇప్పుడు అదనంగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈసారి ఎన్నికల్లో రాజేంద్రనగర్‌‌, జూబ్లీహిల్స్‌‌ నియోజకవర్గాల్లో కూడా సత్తా చాటాలని ఎంఐఎం భావిస్తోంది. శుక్రవారం మజ్లిస్‌‌ అధినేత అసదుద్దీన్‌‌ ఒవైసీ 6 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైన ముంతాజ్​ఖాన్, అహ్మద్‌‌ పాషాఖాద్రీలకు ఈసారి టికెట్​ఇవ్వడం లేదని వెల్లడించారు. వీరి స్థానాల్లో ఈసారి కొత్తగా ఇద్దరు నేతలకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్మినార్ సెగ్మెంట్ నుంచి ఎంసీహెచ్‌‌ మాజీ మేయర్ జుల్ఫికర్ అలీని, నాంపల్లి నుంచి జీహెచ్‌‌ఎంసీ మాజీ మేయర్ మాజిద్ ​హుస్సేన్​ను అభ్యర్థిగా ప్రకటించారు. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్​ హుస్సేన్ మెరాజ్​ను యాకుత్​పురా నుంచి బరిలోకి దించుతున్నట్లు చెప్పారు. 

కొత్తగా ఇద్దరికి చాన్స్ 

మజ్లిస్‌‌ ప్రకటించిన ఆరుగురి జాబితాలో నలుగురు పాత అభ్యర్థులే కాగా, ఇద్దరు కొత్తవారు ఉన్నారు. చాంద్రాయణగుట్ట నుంచి సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌ ఒవైసీ, మలక్‌‌పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్‌‌ నుంచి కౌసర్‌‌ మొయినుద్దీన్‌‌ బరిలోకి దిగుతున్నారు. గతంలో నాంపల్లికి ప్రాతినిధ్యం వహించిన జాఫర్ హుస్సేన్ మిరాజ్​ను తాజాగా యాకుత్ పురా నుంచి పోటీకి దింపుతున్నారు. నాంపల్లి నుంచి మాజిద్‌‌ హుస్సేన్‌‌, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్‌‌కు కొత్తగా అవకాశం కల్పించారు. ఇక మజ్లిస్ పోటీ చేయనున్న బహదూర్‌‌పురా, రాజేంద్రనగర్‌‌, జూబ్లీహిల్స్‌‌ సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.  

మరో రెండు స్థానాలపై నజర్‌‌ 

పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఈసారి అదనంగా మరో రెండు స్థానాల్లో విజయం కోసం సన్నద్ధమవుతోంది. ఇప్పుడున్న 7 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 2 స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్లాన్‌‌ చేస్తోంది. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట, మలక్​పేట, చార్మినార్, యాకుత్​పురా, కార్వాన్, నాంపల్లి, బహదూర్​పురా అసెంబ్లీ సెగ్మెంట్‌‌లకు పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈసారి అదనంగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. అయితే, రాజేంద్రనగర్‌‌, జూబ్లీహిల్స్‌‌ స్థానాల్లో సొంత పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే కంటే మిత్రపక్షం బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థులు గెలవడం కోసమే గట్టిగా పనిచేయాలని మజ్లిస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్ స్థానాల్లో నాంపల్లి సెగ్మెంట్ చేజారిపోయే పరిస్థితి రావడంతోనే అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తోంది. 

అసంతృప్తి వీడని ముంతాజ్‌‌ ఖాన్‌‌  

ఈసారి యువతకు సీట్లు ఇస్తామని ఒవైసీ ఇదివరకే ప్రకటించారు. దీంతో యాకుత్​పురా ఎమ్మెల్యే పాషాఖాద్రి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. కానీ, చార్మినార్ ​సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే ముంతాజ్​ ఖాన్ ​మాత్రం నిరసన గళం ఎత్తారు. తనకు కాకుంటే తన కొడుకుకైనా టికెట్ ఇవ్వాలని.. లేకుంటే తాను ఇండిపెండెంట్​గా బరిలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. అయితే, ముంతాజ్ ఖాన్​ను ఒవైసీ బుజ్జగించారని.. ఆయన సూచన మేరకే మాజీ మేయర్ జుల్ఫికర్​కు చార్మినార్ టికెట్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. నిజానికి చార్మి నార్‌‌ నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కొడుకు నూరుద్దీన్​కు టికెట్‌‌ ఇవ్వాలని భావించారు. చివరకు ముంతాజ్ ఖాన్, నూరుద్దీన్​లను ఒప్పించి జుల్ఫికర్​కు టికెట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ శుక్రవారం పార్టీ హెడ్ ఆఫీస్ దారుసలాంలో జరిగిన కార్యక్రమానికి ముంతాజ్ గైర్హాజరు కావడంతో ఆయన ఇంకా అసంతృప్తి వీడలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 

మజ్లిస్ ఫస్ట్ లిస్ట్ ఇదే.. నియోజక వర్గం    అభ్యర్థి  


1. చాంద్రాయణగుట్ట    అక్బరుద్దీన్​ ఒవైసీ  
2. చార్మినార్​    మీర్​ జుల్ఫికర్ అలీ
3. కార్వాన్​    కౌసర్​ మొయినుద్దీన్​
4. మలక్​పేట    అహ్మద్​ బిన్ అబ్ధుల్లా బలాల
5. నాంపల్లి    మమ్మద్ మాజిద్​ హుస్సేన్​
6. యాకుత్​పురా    జాఫర్​ హుస్సేన్ మెరాజ్​ 

పెండింగ్ లో ఉన్నవి.. 
7. బహదూర్​పురా, 
8. రాజేంద్రనగర్, 9. జూబ్లీహిల్స్​  

బీఆర్ఎస్​కే ఓటేయండి 

హైదరాబాద్/సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత ఉందో కాంగ్రెస్ దీ అంతే ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని దారుసలాంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మజ్లిస్​కు బీజేపీ పైసలు ఇస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినప్పుడు ఎంతిచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో బీఆర్‌‌ఎస్‌‌ సొంతంగా అధికారంలోకి వస్తుందని, మజ్లిస్ పోటీ చేస్తున్న 9 సీట్లలోనూ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్​కు వైఎస్సా ర్​ టీపీ చీఫ్ షర్మిల మద్దతుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆమె ఎవరో తనకు తెలియదన్నారు. ఆమె వైఎస్సార్​ బిడ్డ అయితే ఏమైనా గొప్పా? అని కామెంట్ చేశారు. గురువారం రాత్రి సంగారెడ్డిలో జరిగిన మజ్లిస్ సభలోనూ ఒవైసీ మాట్లాడారు. తాము పోటీ చేయని చోట మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్​కే ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్​కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనన్నారు.