యజమాని హామీతో ఉద్యోగులకు లోన్స్.. కొత్త లోన్ యాప్ లాంచ్ చేసిన అష్నీర్ గ్రోవర్

యజమాని హామీతో ఉద్యోగులకు లోన్స్.. కొత్త లోన్ యాప్ లాంచ్ చేసిన అష్నీర్ గ్రోవర్

భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు, మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ మరో కొత్త ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ‘ఫండ్ మై స్టాఫ్’ పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ఉద్యోగులకు సులభంగా రుణాలు అందేలా రూపొందించబడింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ పొందేందుకు క్రెడిట్ హిస్టరీ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఇందులో ఉద్యోగి కోసం జాబ్ ఇచ్చిన యజమాని గ్యారంటీ ఇస్తే చాలు.. లోన్ మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు.

యాప్ ఎలా పనిచేస్తుంది?
ఈ ప్లాట్‌ఫామ్‌లో ముందుగా యజమాని తన సంస్థలోని ఉద్యోగులను నమోదు చేయాలి. తర్వాత ప్రతి ఉద్యోగికి ఎంత వరకు రుణం ఇవ్వవచ్చో పరిమితిని నిర్ణయించవచ్చు. ఉద్యోగి లోన్ కోసం దరఖాస్తు చేస్తే.. ఆ అభ్యర్థనను యజమాని పరిశీలించి గ్యారంటీ ఇస్తారు. ఓనర్స్ ఆమోదం లభించిన వెంటనే రుణ సంస్థ ఉద్యోగి ఖాతాలో డబ్బు జమ చేస్తుంది. తర్వాత ఉద్యోగి నెలవారీ ఈఎంఐల రూపంలో రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

యజమానికి ఆర్థిక భారం లేదు..
ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకత ఏమిటంటే యజమాని స్వయంగా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం ఉద్యోగికి గ్యారంటీగా నిలుస్తారు. రుణాన్ని అందించేది ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పనిచేసే రిజిస్టర్డ్ క్రెడిట్ లెండింగ్ సంస్థలే. దీంతో ఉద్యోగికి అధికారిక రుణం పొందే అవకాశం పెరుగుతుందని సంస్థ చెబుతోంది.

►ALSO READ | ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ.. జొమాటో, స్విగ్గీకి కొత్త సవాల్

‘ఫండ్ మై స్టాఫ్’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాల ప్రకారం లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆర్‌బీఐలో నమోదు పొందిన Ash Grove Capital Private Limited అనే ఎన్‌బీఎఫ్‌సీ ఈ ప్లాట్‌ఫామ్‌కు రుణ భాగస్వామిగా ఉంది. దీంతో రుణాల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ యాప్‌ను అశ్నీర్ గ్రోవర్, అసీమ్ ఘావ్రీ స్థాపించిన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న Third Unicorn సంస్థ అభివృద్ధి చేసింది. భారత్‌పే నుంచి వైదొలిగిన తర్వాత ఈ సంస్థ ఇప్పటికే ZeroPe అనే మెడికల్ ఫైనాన్స్ యాప్‌ను తీసుకురాగా, గతంలో CrickPe అనే ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్‌ను కూడా నిర్వహించింది. ఇప్పుడు ‘ఫండ్ మై స్టాఫ్’ ద్వారా ఉద్యోగులకు ఈజీ లోన్స్ మార్కెట్‌లో కొత్త అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.