- యూనియన్లకు అశ్వత్థామరెడ్డి పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని కాపాడుకుందామని యూనియన్లకు టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన అధ్యక్షతన జేఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు ఆర్టీసీలో ఉన్న టీఎంయూ, ఎన్ఎంయూ, ఈయూ, ఎస్ డబ్ల్యూఎఫ్, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్, ఎస్టీఎంయూ, టీజేఎంయూ.. మొత్తం 8 యూనియన్ల నేతలు హాజరయ్యారు. కార్మికులను అధికారులు వేధిస్తున్నారని, వారిపై పని ఒత్తిడి మరింత పెరిగిందని, రెండు పీఆర్సీలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తదితర సమస్యలను సమావేశంలో యూనియన్ల నేతలు ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. కాగా, ఈయూ, ఎస్ డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీలు పలు కారణాల వల్ల ఈ మీటింగ్ కు రాకుండా వారి ప్రతినిధులను పంపారు. దీంతో ఈనెల 26న మరోసారి సమావేశం నిర్వహించనున్నామని అదే రోజు కార్యాచరణ ప్రకటిస్తామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా థామస్ రెడ్డి వర్గం టీఎంయు మీటింగ్ కు గైర్హాజరైంది.
