అన్న అకిరా పుట్టినరోజే.. మార్క్ శంకర్కి పునర్జన్మ: పవన్‌ భార్య లెజినోవా ఎమోషనల్‌

అన్న అకిరా పుట్టినరోజే.. మార్క్ శంకర్కి పునర్జన్మ: పవన్‌ భార్య లెజినోవా ఎమోషనల్‌

కొణిదెల అకిరా నందన్ (Akira Nandan).. ఈపేరుకు పెద్దగా పరిచయం అవసరంలేదు. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడిగా అకిరా అందరికి సుపరిచితమే. ఇవాళ (ఏప్రిల్ 8) అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా పవన్ సతీమణి అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్టు చేశారు. అకిరా ఎదుగుతున్న తీరు పట్ల తమకు ఎంతో గర్వంగా ఉందని ఆమె సోషల్ మీడియా వేదికగా అన్నారు.

అదేవిధంగా, ఆమె తమ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి జరిగిన సింగపూర్ అగ్ని ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన బాధ, ఆవేదన ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ‘ఇవాళ ఒకరి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ‌‌‌’ అని ఎమోషనల్ అయ్యారు. 

బుధవారం (ఏప్రిల్ 8) అకిరా పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన అన్నా లెజినోవా, ఇవాళ తమ ఫ్యామిలీకి ఎంతో ఎమోషనల్ డే అని తెలిపారు. అకిరా లోతుగా ఆలోచించే స్వభావం, నేర్చుకోవాలనే ఆసక్తి, దయగల మనసు ఉన్న వ్యక్తిగా ఎదుగుతున్నాడని చెప్పారు.

అదే సమయంలో, ఏడాది క్రితం ఇదే రోజున సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ ఘటనలో చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అతను కోలుకున్నప్పటికీ, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇంకా మర్చిపోలేనని తెలిపారు. ఈ సందర్భంగా తమ ఇద్దరు కుమారులను సెలబ్రేట్ చేసుకుంటున్నామని, అయితే మార్క్‌కు ఇది రెండో పుట్టినరోజులా అనిపిస్తోందని పేర్కొన్నారు.

ఇంకా కొనసాగుతున్న దర్యాప్తు! 

ఒక సంవత్సరం గడిచినా ఆ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉందని, కేవలం 10 ఏళ్ల చిన్నారి ఫ్రేయా మృతి, అలాగే 18 మంది పిల్లలు ఆసుపత్రిపాలైన ఘటనకు బాధ్యులు ఎవరో ఇప్పటికీ తెలియలేదని ఆవేదన ఆమె వ్యక్తం చేశారు.

గాయపడిన కొంతమంది పిల్లలకు ఇంకా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుగుతున్నాయని తెలిపారు. ఆ దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడని, అతని ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పటికీ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

వాళ్లే నిజమైన హీరోలు..

అలాగే, ఫైర్ సిబ్బంది రాకముందే 15 మంది పిల్లలను రక్షించిన నిర్మాణ కార్మికులను ఆమె ప్రశంసిస్తూ, వారు నిజమైన హీరోలని పేర్కొన్నారు. చివరిగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ప్రతి ఇంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదా ఫైర్ బ్లాంకెట్ తప్పనిసరిగా ఉంచుకోవాలని, అవి ఉపయోగించాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాకూడదని అన్నా లెజినోవా ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.