GTvsDC IPL 2026: ఇదేం మ్యాచ్ రా సామీ.. థ్రిల్లింగ్ మ్యాచ్.. ఒక్క రన్ తేడాతో ఢిల్లీపై గుజరాత్ విక్టరీ !

GTvsDC IPL 2026: ఇదేం మ్యాచ్ రా సామీ.. థ్రిల్లింగ్ మ్యాచ్.. ఒక్క రన్ తేడాతో ఢిల్లీపై గుజరాత్ విక్టరీ !

ఐపీఎల్లో బుధవారం మస్తు థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. గుజరాత్, ఢిల్లీ జట్లు నువ్వా-నేనా అనే తరహాలో తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో గుజరాత్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో సూపర్ ఓవర్ దిశగా వెళుతుందనుకున్న మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 12 పరుగులకే ఔట్ అయినా.. ఆ తర్వాత గిల్ 70 పరుగులతో, జోస్ బట్లర్ 52 పరుగులతో గుజరాత్ స్కోర్ ను పరుగులు పెట్టించారు. వాషింగ్టన్ సుందర్ కూడా 55 పరుగులతో రాణించాడు. ఫలితంగా.. గుజరాత్ జట్టు 211 పరుగుల భారీ టార్గెట్ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు నిలిపింది.

ఢిల్లీ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్లు నిస్సాంక, కేఎల్ రాహుల్ అదరగొట్టారు. 76 పరుగుల దగ్గర నిస్సాంక (41) వికెట్ను ఢిల్లీ కోల్పోయింది. కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా రాణిస్తూ ఒంటరి పోరాటం చేశాడు. 92 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్తో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రాహుల్ వికెట్ పడటంతో ఇక ఢిల్లీ చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోయిందనుకున్న సమయంలో డేవిడ్ మిల్లర్ ఢిల్లీ ఆశలకు ఊపిరి పోశాడు. కానీ.. ఆ ఆశలు 20వ ఓవర్లో కుల్దీప్ రనౌట్తో ఆవిరైపోయాయి. మూడు ఓవర్లలో ఢిల్లీకి 45 పరుగులు అవసరమైన సమయంలో వింటేజ్ మిల్లర్ను గుజరాత్ బౌలర్లకు పరిచయం చేశాడు. సిరాజ్ బౌలింగ్ చేసిన 19వ ఓవర్లో సిక్స్, ఫోర్, సిక్స్తో మిల్లర్ చెలరేగిపోయాడు. విప్రాజ్ నిగమ్ కూడా ఒక ఫోర్ కొట్టడంతో 19వ ఓవర్లో సిరాజ్ 23 పరుగులు సమర్పించుకున్నాడు.

దీంతో.. ఢిల్లీకి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరం పడ్డాయి. 20వ ఓవర్లో తొలి బంతికి విప్రాజ్ నిగమ్ ఫోర్ కొట్టాడు. రెండో బంతిని షాట్ కొట్టడానికి యత్నించగా గిల్కు క్యాచ్గా దొరికిపోయాడు. నాలుగు బంతుల్లో 9 పరుగులు కొట్టాలి. 20వ ఓవర్లో మూడో బంతికి కుల్దీప్ యాదవ్ సింగిల్ తీశాడు. డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. ఢిల్లీ అభిమానులు ఆశించినట్టుగానే మిల్లర్ 20వ ఓవర్ నాలుగో బంతికి సిక్స్ కొట్టాడు. 

ఇక.. గెలుపు ఢిల్లీదేనని అంతా డిసైడ్ అయిపోయిన తరుణంలో ప్రసీద్ కృష్ణ 20వ ఓవర్లో ఐదో బంతికి ఒక్క రన్ కూడా రాకుండా మిల్లర్ను కట్టడి చేశాడు. 20వ ఓవర్లో ఆరో బంతికి రెండు పరుగులు అవసరమైన తరుణంలో ప్రసీద్ కృష్ణ స్లో బౌన్సర్ వేశాడు. ఈ సమయంలో.. మిల్లర్ రన్ కోసం పరిగెత్తగా కుల్దీప్ యాదవ్ సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోవడంతో రనౌట్ అయ్యాడు. వైడ్ బంతి అవుతుందని రివ్యూ అడిగితే.. ఆ బంతి ఫెయిర్ డెలివరీ అని ఎంపైర్లు తేల్చేయడంతో  ఢిల్లీ ఆశలు అడియాసలయ్యాయి.

  • నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం
  • ఒక్క పరుగు తేడాతో గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
  • బూడిదలో పోసిన పన్నీరైన డేవిడ్ మిల్లర్ (41) కష్టం
  • కుల్దీప్ యాదవ్ రనౌట్తో మలుపు తిరిగిన మ్యాచ్
  • అప్రతిహతంగా సాగుతున్న ఢిల్లీ జైత్ర యాత్రకు బ్రేకులేసిన గుజరాత్
  • గుజరాత్ స్కోర్: 210/4 (20 ఓవర్లు), ఢిల్లీ స్కోర్: 209/8 (20 ఓవర్లు)