ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి కొడుకు పరార్?..  ఫిబ్రవరి 21న ఎంగేజ్ మెంట్.. మార్చి 6న పెండ్లి ఫిక్స్

ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి కొడుకు పరార్?..  ఫిబ్రవరి 21న ఎంగేజ్ మెంట్.. మార్చి 6న పెండ్లి ఫిక్స్
  • కార్డులు పంచేందుకు వెళ్లి వరుడి అదృశ్యం
  • నెల రోజులుగా ఎదురుచూసిన పెళ్లి కూతురు కుటుంబం
  • వరుడి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళన
  • కమలాపూర్ మండలం ఉప్పల్​లో ఘటన

కమలాపూర్(ఎల్కతుర్తి), వెలుగు: ప్రేమించిన యువతి కోసం ఓ పెండ్లి కొడుకు పరారైన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా కార్డులు పంచేందుకు వెళ్లిన వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు మంగళవారం అతడి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే.. ఉప్పల్ గ్రామానికి చెందిన వీరబోయిన రాజయ్య కొడుకు కిరణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఎల్కతుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో గత ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లి నిశ్చయమైంది. వరకట్నంగా రూ.36 లక్షలు డిమాండ్ చేయగా, పెద్దమనుషుల సమక్షంలో రూ.26 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న నిశ్చితార్థం జరిపి కొంత నగదు, బంగారం ఇచ్చారు. మిగతా బంగారం, పెట్టుపోతలతో పాటు మార్చి 6న వివాహం జరిపేందుకు లగ్నపత్రిక రాసి ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఏర్పాట్లు పూర్తయ్యాక అదనపు కట్నం డిమాండ్​..

పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యే సరికి కిరణ్ కుటుంబ సభ్యులు మరో రూ.9 లక్షలు అదనంగా ఇస్తేనే పెళ్లి చేస్తామని వధువు కుటుంబానికి తెలిపారు. ఇప్పటికే భూమి అమ్మి, అప్పులు చేసి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామని వధువు తండ్రి చెప్పడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మార్చి 4న కార్డులు పంచేందుకు వెళ్లిన కిరణ్ తిరిగి ఇంటికి రాలేదు. అతని ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉండటంతో ప్రేమించిన యువతితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

వధువు కుటుంబ సభ్యులు కిరణ్ ఇంటివారిని నిలదీశారు. అయితే అతని ఆచూకీ తమకూ తెలియదని చెబుతూ అదే రోజు కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కిరణ్ తమను మోసం చేశాడంటూ బాధితులు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

న్యాయం చేయాలని ఆందోళన..

పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోవడంతో తమ కుటుంబ పరువు పోయిందని, ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వధువు కుటుంబ సభ్యులు వాపోయారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కిరణ్ ఇంటి ఎదుట మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడి నుంచి వెళ్లబోమని స్పష్టం చేశారు. కమలాపూర్ సీఐ నవీన్ మాట్లాడుతూ.. ఘటన జరిగిన రోజే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం జరుగుతోందని, బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.