నేడు శ్రీలంక‑పాకిస్తాన్‌‌‌‌ ఫైనల్​ ఫైట్‌‌

నేడు శ్రీలంక‑పాకిస్తాన్‌‌‌‌ ఫైనల్​ ఫైట్‌‌
  • ఆసియా ఎవరిదో?
  • నేడు శ్రీలంక‑పాకిస్తాన్‌‌‌‌ ఫైనల్​ ఫైట్‌‌
  • ఫేవరెట్‌‌గా బరిలోకి లంక
  • రా. 7.30 నుంచి స్టార్​స్పోర్ట్స్​లో 

ఆసియా కప్‌‌ మొదలైనప్పుడు అందరి ఫేవరెట్‌‌ టీమిండియానే. ఫ్యాన్స్‌‌ అంతా ఇండియా–పాకిస్తాన్‌‌ మ్యాచ్‌‌ల గురించే మాట్లాడుకున్నారు. ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్‌‌ జరుగుతుందని అంచనా వేశారు..! అయితే, వాళ్ల అంచనాలు సగమే నిజమయ్యాయి. పాక్‌‌ ఫైనల్‌‌కు వచ్చింది కానీ.. ఇండియా సూపర్‌‌–4లోనే ఇంటిదారి పట్టింది. ఎవ్వరూ ఊహించని రీతిలో శ్రీలంక టైటిల్‌‌ ఫైట్‌‌కు దూసుకొచ్చింది..!  అంతేనా..  ఇప్పుడు తుదిపోరులో ఆ జట్టే ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది!  ఓటమితో టోర్నీని ప్రారంభించి సూపర్‌‌–4లో అఫ్గాన్‌‌, ఇండియా, పాకిస్తాన్‌‌ను చిత్తు చేసి  అందరినీ ఆశ్చర్యపరిచిన లంక ఇప్పుడు టైటిల్‌‌కు ఒక్క అడుగు దూరంలోనే ఉంది..!  అదే ఊపులో టైటిల్‌‌ నెగ్గాలని కోరుకుంటోంది...! కప్పు గెలిస్తే  కొన్నేళ్లుగా పతనావస్థలోకి జారుతున్న లంక క్రికెట్‌‌కు తిరిగి జీవం పోసినట్టు అవుతుంది..!   మరి లంకేయులకు పాక్‌‌ ఆ చాన్స్‌‌ ఇస్తుందా?  పదేళ్లుగా ఊరిస్తున్న కప్పును మరోసారి అందుకుంటుందా?  దుబాయ్‌‌ గడ్డపై ఇరు జట్ల మధ్య నేడే ఫైనల్‌‌ ఫైట్‌‌..! ఆసియా బాద్‌‌షా అయ్యేది ఎవరో? 

దుబాయ్‌‌:  థ్రిల్లింగ్‌‌ ఛేజింగ్‌‌లు.. లాస్ట్ ఓవర్ విక్టరీలతో..  రెండు వారాలుగా క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు కిక్ ఇస్తున్న ఆసియా కప్‌‌ తుది అంకానికి చేరుకుంది. అద్భుత ఆటతో టైటిల్‌‌ ఫైట్‌‌కు వచ్చిన శ్రీలంక ఆదివారం ఇక్కడి దుబాయ్‌‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కప్‌‌ నెగ్గి రాజకీయ, ఆర్థిక సంక్షోభం కారణంగా కొన్నాళ్లుగా నిరాశలో ఉన్న తమ దేశ   ప్రజలకు ఎంతో కొంత స్వాంతన చేకూర్చాలని కోరుకుంటోంది. వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలోనే జరగాలి. కానీ, భద్రతా కారణాల వల్ల చివరి నిమిషంలో యూఏఈకి షిఫ్ట్‌‌ చేశారు. అయినా టెక్నికల్‌‌గా లంకనే ఆతిథ్య జట్టుగా వ్యవహరిస్తోంది. సూపర్‌‌4లో తిరుగులేని పెర్ఫామెన్స్‌‌ చేసిన శ్రీలంక ఇప్పుడు ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. పైగా శుక్రవారం పాక్‌‌ను చిత్తు చేసింది.  ఫైనల్లోనూ అదే రిజల్ట్‌‌ను రిపీట్‌‌ చేసి కప్పు కైవసం చేసుకోవాలని చూస్తోంది. 2014 టీ20 వరల్డ్‌‌ కప్‌‌లోనూ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక టైటిల్‌‌ నెగ్గింది.  తమ క్రికెట్‌‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునాది వేసుకుంది. కానీ, క్రికెట్‌‌ బోర్డులో అంతర్గత రాజకీయాలు, టీమ్‌‌ సెలక్షన్స్‌‌లో లోపాలు లంక క్రికెట్‌‌ను మళ్లీ ఇక్కట్లలోకి నెట్టాయి. అయితే, షనక కెప్టెన్సీలోని జట్టు  టీ20 ఫార్మాట్‌‌లో తమ గేమ్‌‌ ప్లాన్‌‌ను మార్చి, దూకుడు పెంచి ముందుకొస్తోంది. పేరున్న ప్లేయర్లు లేకపోయినా అద్భుతాలు చేస్తోంది. లంక టాప్‌‌–5 బ్యాటర్లు జట్టు కోసం  గొప్పగా ఆడుతున్నారు. ఓపెనర్లు కుశాల్‌‌ మెండిస్‌‌, నిశాంక మంచి ఆరంభాలు ఇస్తుండగా.. మధ్యలో గుణతిలక, భానుక రాజపక్స, కెప్టెన్‌‌ షనక, కరుణరత్నె అవసరమైన సమయంలో పరుగులు అందిస్తున్నారు. ఎవ్వరూ భారీ స్కోర్లు చేయకపోతున్నా.. 150 పైగా స్ట్రయిక్‌‌ రేట్‌‌తో లక్ష్యాలను ఛేదిస్తున్నారు. టోర్నీలో ఐదు మ్యాచ్‌‌ల్లో లంక బ్యాటర్లు 28 సిక్సర్లు, 62 ఫోర్లు కొట్టారంటే వాళ్ల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్‌‌లో వానిందు హసరంగకు తీక్షణ మంచి స్పిన్‌‌ బౌలింగ్‌‌ పార్ట్‌‌నర్‌‌గా మారగా..  పేస్‌‌ లీడర్‌‌ దిల్షాన్‌‌ మదుషంక తన స్పీడుతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు. గత మ్యాచ్‌‌ల జోరు కొనసాగిస్తే లంక కప్పు నెగ్గడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. 

పాక్‌‌ తక్కువేం కాదు..

పాకిస్తాన్‌‌ ఆసియా కప్‌‌ నెగ్గి పదేళ్లు అవుతోంది. చివరగా 2012లో కప్పు సాధించిన ఆ జట్టు మరో ట్రోఫీ కోసం నిరీక్షిస్తూనే ఉంది.  ఇండియా, అఫ్గాన్‌‌పై ఘన విజయాలతో ఫైనల్‌‌కు వచ్చిన పాక్‌‌ బలంగానే ఉంది. కానీ, గత పోరులో లంక చేతిలో ఓటమితో ఆ జట్టు కాస్త డీలా పడింది. పైగా, కెప్టెన్‌‌ బాబర్‌‌ ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లోనూ నిరాశ పరిచాడు. ఐదు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫైనల్లో అయినా ఫామ్‌‌ అందుకొని జట్టును ముందుండి నడిపించాలని బాబర్‌‌ ఆశిస్తున్నాడు. పాక్‌‌ ప్రధాన బలం బౌలింగే. యంగ్‌‌ స్పీడ్‌‌ స్టర్‌‌ నసీమ్‌‌ షా రోజు రోజుకూ అత్యద్భుత బౌలింగ్‌‌తో ఆకట్టుకుంటున్నాడు. అతనితో పాటు పేసర్లు హరిస్‌‌ రవూఫ్‌‌, హస్నైన్‌‌ కూడా మెప్పిస్తున్నారు. లెగ్‌‌ స్పిన్నర్‌‌ షాదాబ్‌‌ ఖాన్‌‌, లెఫ్టార్మ్‌‌ ఆఫ్‌‌ స్పిన్నర్ మొహమ్మద్‌‌ నవాజ్‌‌ కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌‌ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే, మొదట బ్యాటింగ్‌‌ చేసినప్పుడు పాక్‌‌ తడబడుతోంది. ఇండియాతో తొలిపోరులో, శ్రీలంకతో గత మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఓపెనర్‌‌ మహ్మద్‌‌ రిజ్వాన్‌‌ ఫామ్‌‌లో ఉన్నప్పటికీ.. టాపార్డర్‌‌లో ఏ బ్యాటర్‌‌  స్ట్రయిక్​ 120 ప్లస్‌‌ లేకపోవడం గమనార్హం. ఛేజింగ్‌‌లో మాత్రం పాక్‌‌ సత్తా చాటుతోంది. రిజ్వాన్‌‌తో పాటు ఇతర బ్యాటర్లూ ఒత్తిడిలో రాణిస్తున్నారు. కాబట్టి ఆ జట్టుకు టాస్‌‌ కీలకం కానుంది. 

జట్లు (అంచనా)


శ్రీలంక:  కుశాల్‌‌‌‌ మెండిస్‌‌ (కీపర్‌‌), నిశాంక, ధనంజయ డిసిల్వ, దనుష్క గుణతిలక, షనక (కెప్టెన్), రాజపక్స, చమిక కరుణరత్నె, వానిందు, తీక్షణ, ప్రమోద్‌‌ ముదషన్‌‌, మదుషంక. 
పాకిస్తాన్‌‌: బాబర్‌‌ ఆజమ్‌‌(కెప్టెన్‌‌), రిజ్వాన్‌‌ (కీపర్‌‌), జమాన్‌‌, ఇఫ్తికర్‌‌, కుష్దిల్‌‌ షా, షాదాబ్‌‌ ఖాన్‌‌, ఆసిఫ్‌‌ అలీ, నవాజ్‌‌, నసీమ్‌‌, రవూఫ్‌‌, హస్నైన్‌‌.