Asif Ali: ఆసియా కప్‌లో దక్కని చోటు.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ పవర్ హిట్టర్ రిటైర్మెంట్

Asif Ali: ఆసియా కప్‌లో దక్కని చోటు.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ పవర్ హిట్టర్ రిటైర్మెంట్

పాకిస్థాన్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంళవారం (సెప్టెంబర్ 2) సోషల్ మీడియాలో ఆసిఫ్ అలీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ధృవీకరించాడు. 33 ఏళ్ళ ఆసిఫ్ అలీ పాకిస్థాన్ ఫినిషర్ గా, పవర్ హిట్టర్ గా పేరొందాడు. రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియా పోస్ట్‌లో ఆసిఫ్ ఇలా వ్రాశాడు.."పాకిస్తాన్ జెర్సీ ధరించడం నా జీవితంలో గొప్ప గౌరవం. క్రికెట్ గ్రౌండ్ లో నా దేశానికి సేవ చేయడం నాకు గర్వకారణం". అని అలీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ప్రపంచ వ్యాప్తంగా జరగబోయే టీ20 లీగ్ లు ఆడతానని కన్ఫర్మ్ చేశాడు. 

33 ఏళ్ళ ఆసిఫ్ అలీకి ఇటీవలే ప్రకటించిన ఆసియా కప్ లో చోటు దక్కలేదు. ఫినిషర్ గా పేరున్నప్పటికీ సీనియర్ క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెక్ పెట్టింది. రెండేళ్లుగా జాతీయ జట్టులో ఈ పాక్ బ్యాటర్ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ ఆసిఫ్ కు నిరాశ తప్పలేదు. ఈ కారణంగా ఆసిఫ్ అలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2021 టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 7 బంతుల్లోనే 25 పరుగులు చేసి పాకిస్థాన్ కు ఉత్కంఠ విజయాన్ని అందించడం అతని కెరీర్ లో హైలెట్ గా నిలిచింది.

2018 పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడిన ఆసిఫ్ అదరగొట్టాడు. ఈ లీగ్ ఫైనల్లో వరుసగా మూడు సిక్సర్లు బాది సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అదే సంవత్సరం వెస్టిండీస్‌తో టీ20 అరంగేట్రం చేశాడు. మారాయి రెండు నెలలకే 2018లో వన్డే   అరంగేట్రం చేశాడు. ఆసిఫ్ అలీ నిలకడగా ఆడడంలో విఫలమయ్యాడు. 21 వన్డేల్లో 25.46 యావరేజ్ తో 382 పరుగులు చేశాడు. వీటిలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో 58 మ్యాచ్ లాడి 15.18 యావరేజ్, 133.87 స్ట్రైక్ రేట్‌తో 577 పరుగులు చేశాడు.