అస్సాం సింగం.. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా

అస్సాం సింగం.. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా

మణిపూర్‌పై ఇటీవల చోటుచేసుకున్న హింసకాండపై ప్రత్యేక దర్యాప్తు బృందంలో భాగమైన, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అస్సాంలోని సీనియర్ పోలీసు అధికారి ఆనంద్ మిశ్రా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసమేనని వెల్లడించారు. అస్సాం-మేఘాలయ కేడర్‌లకు చెందిన ఈ డైనమిక్ ఐపీఎస్ అధికారి  ఇటీవల మణిపూర్‌లో హింసాకాండపై విచారణ జరుపుతున్న సిట్‌లో భాగమయ్యారు. సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందడంతో అందరూ అతన్ని అస్సాం సింగం అని కూడా పిలుస్తారు.

మిశ్రా తన రాజీనామా లేఖలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యంతో కూడిన జీవితాన్ని కొనసాగించడానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మణిపూర్‌ కంటే ముందు, మిశ్రా అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా అపాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా మిశ్రా.. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో.. జీవితంలో సామాజిక, వ్యక్తిగత లక్ష్యాలను ఉదహరించారు.

తాను ఐపీఎస్ కు మించి వివిధ సామాజిక సేవలు చేస్తూ స్వేచ్ఛాయుత జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని, అందుకే బేషరతుగా ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని మిశ్రా వెల్లడించారు. అయితే, మిశ్రా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని, బీహార్‌లో  వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం నుంచి పోటీ చేయవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి.