పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు.. కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం

పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు.. కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
  •     అస్సాం సీఎం భార్యపై ఆరోపణల నేపథ్యంలో చర్యలు 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత పవన్ ఖేరా నివాసంలో అస్సాం పోలీసులు మంగళవారం సోదాలు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో ఢిల్లీ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూడు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రెయిడ్స్ సమయంలో పవన్ ఖేరా ఇంటిలో లేరు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. 

‘‘సోమవారమే ఆయన  గువాహటి నుంచి పారిపోయారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారని తెలిసింది. కానీ, ఆయన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పరారయ్యారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని తెలిపారు. సోదాల అనంతరం అస్సాం ఏసీపీ డెబోజిత్ నాథ్ మీడియాతో మాట్లాడారు. ‘‘గువాహటి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన కేసులో పవన్ ఖేరాను విచారించాల్సి ఉంది. ఆయన ఇంటిలో సోదాలు జరిపి కొన్ని కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియదు. కానీ, త్వరలోనే గుర్తిస్తాం’’ అని పేర్కొన్నారు. 

రాజకీయ వేధింపులే: కాంగ్రెస్

ఈ ఘటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అగ్రనేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ఇవి పక్కా రాజకీయ వేధింపులే అని మండిపడ్డారు. ‘‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రాథమిక ప్రశ్నలు అడిగినందుకు పవన్ ఖేరాను అరెస్ట్ చేయడానికి భారీ పోలీస్ బలగాలను పంపడం చూస్తుంటే అస్సాం సీఎం ఎంతగా అసహనానికి గురవుతున్నారో అర్థమవుతున్నది’’ అని విమర్శించారు. అంతకు ముందు ఆదివారం పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భుయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూడు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు ఉన్నాయని ఆరోపించారు. వీటిని తోసిపుచ్చిన ఆమె సోమవారం ఖేరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు.