జూబ్లీహిల్స్ స్టేషన్ లో షర్మిల.. పరామర్శకు వచ్చిన తల్లి.. అడ్డుకున్న పోలీసులు

జూబ్లీహిల్స్ స్టేషన్ లో షర్మిల.. పరామర్శకు వచ్చిన  తల్లి.. అడ్డుకున్న పోలీసులు

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆమెను కలవడానికి షర్మిల తల్లి విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో.. విజయమ్మ పోలీస్ స్టేషన్ ఎదుటే నిరసన తెలుపుతున్నారు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన బిడ్డను కలవడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని విజయమ్మ, పోలీసులను నిలదీశారు. అసలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టేషన్ లో ఉన్న కుమార్తెను పరామర్శిస్తే తప్పేంటనీ విజయమ్మ పోలీసులను ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తెలంగాణలో లేదా అంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో ఆమెతోపాటు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు సైతం తరలివచ్చారు. అంతకుముందు వైఎస్ఆర్టీపీ అఫీసు ముందు ఆ  పార్టీ చీఫ్  షర్మిలను  పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  మహిళా కారిస్టేబుల్ తో  పాటుగా ఎస్ ఐ రవీందర్ పై షర్మిల చేయిచేసుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.