మయన్మార్‌‌‌‌లో 38 మంది కాల్చివేత

 మయన్మార్‌‌‌‌లో 38 మంది కాల్చివేత
  • ఇప్పటివరకూ 126 మంది బలి..
  • 2 వేలకు పైగా నిరసనకారుల అరెస్ట్
  • నిరసనకారులపై పోలీసులు, ఆర్మీ విచ్చలవిడిగా కాల్పులు
  • చైనీస్ ఫ్యాక్టరీలను తగులబెట్టిన ప్రొటెస్టర్లు..
  • యాంగన్​లో మార్షల్ లా విధించిన జుంటా  

యాంగన్: మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసిన మిలిటరీకి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వస్తున్న నిరసనకారులను పోలీసులు, సోల్జర్లు విచ్చలవిడిగా కాల్చేస్తున్నారు. ఆదివారం ఒక్క యాంగన్ సిటీలోనే 22 మందిని పోలీసులు కాల్చిచంపారు. పలు ఇతర సిటీల్లో మరో16 మందిని బలి తీసుకున్నారు. యాంగన్ సిటీలోని హిలాంగ్ థార్ యార్ టౌన్ షిప్ లో చైనాకు చెందిన నాలుగు టెక్స్ టైల్స్, ఒక కెమికల్ ఫ్యాక్టరీలను నిరసనకారులు తగులబెట్టారు. ఫ్యాక్టరీల వద్దకు ఫైర్ ఇంజన్లు రాకుండా 2 వేల మంది వరకూ గుమిగూడి అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు ఇష్టారీతిగా కాల్పులు జరపడంతో పదహారు మంది చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. మయన్మార్ లో ఆర్మీ పాలకులు ఫిబ్రవరి 1న సూకీ సర్కార్ ను కూల్చేశారు. ఆమెతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అప్పటినుంచి ప్రజలు ఆర్మీకి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై కూడా పోలీసులు, సోల్జర్లు కాల్పులు జరుపుతున్నారని ‘అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ)’ సంస్థ తెలిపింది. ఇప్పటిదాకా 126 మంది నిరసనకారులను జుంటా బలితీసుకుందని, 2 వేలకు పైగా నిరసనకారులను అరెస్ట్ చేసిందని వెల్లడించింది. ఇప్పటిదాకా నిరసనకారుల దాడిలో ఇద్దరు పోలీసులు చనిపోయినట్లు పేర్కొంది. 
యాంగన్​లో మార్షల్ లా
యాంగన్ సిటీలోని ఆరు టౌన్ షిప్ లలో సోమవారం నుంచి మార్షల్ లాను విధించినట్లు జుంటా ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ టీవీ చానెల్‌‌‌‌ వెల్లడించింది. ప్రొటెస్టర్లను క్రిమినల్స్​గా అభివర్ణించింది. సిటీలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా నిలిపివేసినట్లు ఆ చానెల్ తెలిపింది. మిలిటరీ తిరుగుబాటు చేసినప్పటి నుంచి మయన్మార్ అంతటా ఎమర్జెన్సీని ప్రకటించారు. కానీ ఆదివారం యాంగన్​లో నిరసనలు మరింత తీవ్రం కావడంతో మార్షల్ లాను ప్రకటించారు. అయితే ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల ద్వారా నిరసనకారులు ఇంటర్నెట్ ను వాడుకుంటున్నారని లోకల్ మీడియా వెల్లడించింది. 
ఉల్లంఘిస్తే మిలిటరీ కోర్టుకు.. 
మార్షల్ లా విధించిన ప్రాంతాల్లో ఇతర చట్టాలన్నీ రద్దు అవుతాయి. ఆ ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్, జ్యుడీషియల్, లా ఎన్ ఫోర్స్ మెంట్ వంటివన్నీ ఆర్మీ అధీనంలోకి వస్తాయి. మార్షల్ లా ఉన్న ప్రాంతాల్లో రూల్స్ ను ఉల్లంఘించేవారిని మిలిటరీ కోర్టుల్లో విచారిస్తారు. కనీసం మూడేళ్ల జైలు నుంచి తీవ్రమైన శిక్షలు, మరణ శిక్ష కూడా విధించేందుకు అవకాశం ఉంటుంది.
మా ఫ్యాక్టరీలు, సిబ్బందిని రక్షించాలె: చైనా 
మయన్మార్​లో తమ దేశానికి చెందిన కంపెనీ లు పెట్టుబడులు పెట్టిన ఫ్యాక్టరీలపై దాడిపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. తమ కంపెనీల ఆస్తులను, ఉద్యోగులు, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మిలిటరీ జుంటాపైనే ఉందని స్పష్టం చేసింది. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే జుంటాకు చైనా సపోర్ట్ చేస్తుండటం వల్లే చైనీస్ ఫ్యాక్టరీలకు నిప్పు పెట్టారని లోకల్ మీడియా తెలిపింది.