ఆడపడుచులంతా.. అట్లు పొయ్యంగ!

ఆడపడుచులంతా.. అట్లు పొయ్యంగ!

పండుగలంటే ఇంటికి, కుటుంబానికి కొత్త శోభ తెస్తాయి. ముఖ్యంగా తెలుగింటి పండుగలంటే సంప్రదాయాలకు, సంబురాలకు కేరాఫ్​ అడ్రస్. ఇవి ఒకరోజు రెండ్రోజుల పండుగల్లానే కనిపించినా పురాణ మూలాలు ఉండి, ఎంతో శక్తి, పవిత్రతను కూడగట్టుకునే అంశాలు ఉంటాయి. అలాంటి పండుగల్లో ‘అట్లతద్ది’ ఒకటి. శనివారం అంటే రేపు జరుపుకునే ఈ పండుగ గురించి...‘అట్లతద్ది’ పండుగంటే కేవలం దేవుడితో ముడిపడి ఉన్న పండుగే కాదు. సంప్రదాయాలను, సంబురాల్ని, సుఖసంతోషాలను కలిపి అందించే పండుగ. ముఖ్యంగా అమ్మాయిలు జరుపుకునే పండుగ. ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు బహుళ తదియ నాడు ఈ పండుగ వస్తుంది. అందుకే దీన్ని ‘అట్ల తదియ’ అని కూడా పిలుస్తారు. అట్లతద్దికి ముందు గోరింటాకు పెట్టుకుంటారు. తెలిసినవాళ్లను పిలుస్తారు. అట్లతద్ది రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో తిని ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. 

ఈ ఉపవాసంతోనే పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇంటిలో తూర్పు వైపు గౌరీ పూజ మంటపము ఏర్పాటు చేస్తారు. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు పాడతారు. సాయంత్రం చంద్రుడ్ని చూసిన తర్వాత గౌరీదేవికి పదకొండు అట్లు నైవేద్యంగా ఇస్తారు. గౌరీదేవి దగ్గర పెట్టిన ఈ నైవేద్యాన్ని తాంబూలంతో వాయనంగా ఇస్తారు. ముత్తైదువులకు అట్లు, ఫలాలు వాయనం ఇస్తారు.  అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకుంటారు. అట్లతద్ది నాడు ఉయ్యాల కట్టి ‘అట్ల తద్దోయ్​.. ఆరట్లోయ్​, ముద్దపప్పోయ్​ మూడట్లోయ్’ అంటూ పాటలు పాడుతూ ఉయ్యాల ఊగుతారు కూడా. అందుకే దీన్ని‘ఉయ్యాలపండగ’ అని కూడా అంటారు. శివుడ్ని భర్తగా పొందాలని కోరుకుంటుంది గౌరీదేవి. ఈ విషయాన్ని గ్రహించిన నారదుడు గౌరితో మాట్లాడతాడు. ఈ కోరిక ఫలించాలంటే చేయాల్సిన వ్రతం గురించి సూచిస్తాడు. అలా నారదుని సూచనతో గౌరీదేవి చేసిన వ్రతమే ‘అట్లతద్ది’ అని పురాణాలు చెబుతున్నాయి.